బెంగళూరులోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఐటీ సంస్థ ప్రాంగణంలో నడుస్తున్న డేకేర్ సెంటర్ పసిపిల్లల పాలిట నరకంగా మారింది. ఉద్యోగ రీత్యా బిజీగా ఉండటం వల్ల కొందరు తల్లిదండ్రులు డే కేర్ సెంటర్‌లో పిల్లలను వదిలి వెళ్తున్నారు. కానీ అక్కడ పనిచేసే సిబ్బంది పిల్లలపై రాక్షతత్వం చూపిస్తున్నారు. రెండు నుంచి మూడేళ్ల వయస్సున్న అమాయక చిన్నారుల అల్లరిని అణచడానికి అక్కడ పనిచేసే కేర్ టేకర్లు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం లేకుండా చిన్న పిల్లలపై దాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. క్యాప్‌జెమిని బెంగళూరు క్యాంపస్‌లో నడుస్తున్న డే కేర్‌ సెంటర్ లోపల ఈ దారుణాలు జరిగాయి.

Also Read : బుల్లెట్ రైలు టెక్నాలజీ.. 6G నెట్‌వర్క్.. భారత్-జపాన్ మధ్య కుదిరిన ఆ 5 కీలక ఒప్పందాలివే!

పిల్లలు ఏడ్చినప్పుడు వారిని నిశ్శబ్దంగా ఉంచడం కోసమే కేర్ టేకర్స్ ఇలా దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. పసిపిల్లలు ఏడుపు ఆపకపోతే అక్కడ ఉండే ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ డ్రమ్ లోపల వారిని బలవంతంగా కూర్చోబెట్టి.. తలుపులు మూసేసి భయపెడుతున్నారు. అంతటితో ఆగకుండా వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్లపై పిల్లలను కూర్చోబెట్టి ఎక్కువ ప్రెజర్ ఉండే టాయిలెట్ జెట్ స్ప్రేల ద్వారా నేరుగా వారి నోట్లోకి, ముఖంపైకి నీళ్లు కొట్టి ఊపిరాడకుండా చేసేవారని దర్యాప్తులో తేలింది. చిన్నారులు మరింత భయపడేలా వారిని చీకటి బాత్‌రూమ్‌లలో గంటల తరబడి ఒంటరిగా బంధించినట్లు కూడా తెలుస్తోంది.

వీటికి సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటకు రావడంCతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలను సిబ్బంది ఎలా హింసిస్తున్నారో కళ్లారా చూసిన సాఫ్ట్‌వేర్ దంపతులు, మిగతా తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై క్రూరత్వ నిరోధక చట్టం (జువెనైల్ జస్టిస్ యాక్ట్) కింద ఐదుగురు మహిళా సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై ఐటీ సంస్థ కూడా తీవ్రంగా స్పందిస్తూ.. తమ ఉద్యోగుల కుటుంబాల భద్రతే తమకు ముఖ్యమని ప్రకటిస్తూ ఆ డేకేర్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేసింది.

Also Read : ఇదెక్కడి ఫోన్ రా మావా: ఊరమాస్ ఫీచర్లు.. మూడు 50MP కెమెరాలు..!