BJP New National Team : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం బిగ్‌షాక్‌ ఇచ్చింది. ఈ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. పైగా గతంలో జాతీయ ఉపాధ్యాక్షురాలిగా ఉన్న డీకే అరుణ, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మన్‌ను ఆ పదవులనుంచి తప్పించడం గమనార్హం. కాగా, జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ సంస్థాగత వ్యవహారాల కీలక నేత బీఎల్ సంతోష్ తదితరులు నెల రోజులగా కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  అయితే జాతీయ స్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కార్యవర్గాన్ని ప్రకటించడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుత కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కకపోగా ఆంధ్రప్రదేశ్‌ కు మాత్రం మూడు కీలక పదవులు దక్కాయి. గతంలో ఏపీ అధ్యక్షురాలిగా పనిచేసిన ప్రస్తుత ఎంపీ పురంధేశ్వరి కి జాతీయ కమిటీలో ఉపాధ్యాక్షురాలిగా నియమించారు. ఆమెతో పాటు రామ్‌ మాధవ్‌కు కూడా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా జాతీయ బృందంలో కీలక బాధ్యత లభించింది. ఆయనను జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఇక ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణకు చెందిన సీనియర్‌ బీజేపీ నేత లక్ష్మణ్‌ను కూడా అ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఓబీసీ విభాగానికి కొత్త అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్యను నియమిస్తూ  పార్టీ నిర్ణయం తీసుకుంది.  కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read : ఆటో డ్రైవర్ ఇంట్లో సంచుల కొద్దీ డబ్బులు…ఐదుగంటలు లెక్కించగా తేలిందేంటంటే?


ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాక గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగానే గెలిచి ఆ స్థానాలను కైవసం చేసుకుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో కలిసి పోటీ చేసి చాలా తక్కువస్థానాల్లో విజయం సాధించించినప్పటికీ అక్కడ వారికి పదవులు దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి వారికి అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ తెలంగాణ బీజేపీలో నెలకొన్న వర్గ విభేదాల మూలంగానే ఇక్కడి వారికి అవకాశం దక్కలేదన్న వార్తలు వినవస్తున్నాయి. తెలంగాణలో ఉన్న పార్టీ ఎంపీలు ఒక్కోక్కరు ఒక వర్గంగా, ఎమ్మెల్యేలు మరో వర్గంగా కొనసాగుతున్నారనే ప్రచారం ఉంది. పార్టీలో సఖ్యత లేని కారణాంగానే ఇక్కడివారికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదన్న ప్రచారం సాగుతోంది.కాగా,  బీజేపీ  కొత్త కేంద్ర కార్యవర్గంలో  స్మృతి ఇరానీకి అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు దక్కాయి. ఇక వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి ప్రముఖులకు ఉపాధ్యక్ష పదవులు లభించాయి.

Also Read : మా కాలేజీకి రావొద్దు.. సీజేఐ రాకపై బెంగళూరులో విద్యార్థుల నిరసన!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.