వివాహ బంధానికి గుడ్ బై పలికి విడాకులు పొందినంత మాత్రాన మాజీ భార్యకు పోషణ ఖర్చులు నిరాకరించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్తను విడిచి వెళ్లడం వల్ల విడాకులు ఇచ్చినప్పటికీ, మాజీ భర్త నుంచి భరణం కోరే హక్కు మహిళకు ఉంటుందని సంచలన తీర్పునిచ్చింది. అయితే ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోకుండా ఉండటంతో పాటు, తనకు తాను స్వయంగా జీవనోపాధి పొందే మార్గం లేనప్పుడు మాత్రమే ఈ అర్హత వర్తిస్తుందని లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా తేల్చి చెప్పారు.

Also Read : శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు కిరీటం మాయం!

సునీత అనే మహిళ అదనపు కట్నం వేధింపుల కారణంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. అదనంగా రూ.1 లక్షతో పాటు బైక్, కలర్ టీవీ తేవాలంటూ భర్త, ఆయన కుటుంబ సభ్యులు వేధించారని ఆరోపించింది. ఈ క్రమంలో 2009లో సీఆర్‌పీసీ సెక్షన్ 125 కింద పోషణ ఖర్చుల కోసం సుల్తాన్‌పుర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భర్త, ఆమె కావాలనే తనని విడిచి వెళ్లిపోయిందని కోర్టుకు తెలిపి, 2014లో ఎక్స్‌పార్టె విడాకులు పొందారు. ఆ తర్వాత ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నారు.

ఈ క్రమంలో సునీత దాఖలు చేసిన భరణం పిటిషన్‌ను సుల్తాన్‌పుర్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు నిర్ణయం పొరపాటని వ్యాఖ్యానించింది. చట్టప్రకారం విడాకులు పొందినప్పటికీ సీఆర్‌పీసీ సెక్షన్ 125 కింద ఆ మహిళను భార్యగానే పరిగణించాలని స్పష్టం చేసింది. భర్తను విడిచి వెళ్లిందనే ఒక్క కారణంతో భరణాన్ని నిరాకరించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.

విడాకులు పొందిన మహిళకు రెండో వివాహం జరిగే వరకు లేదా ఆమె స్వయంగా సంపాదించుకునే స్థాయికి చేరే వరకు మాజీ భర్తే పోషణ ఖర్చులు భరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను సమీక్షించాలని ఆదేశించింది. అదే సమయంలో సునీత మైనర్ కుమారుడికి కూడా యుక్తవయస్సు వచ్చే వరకు తండ్రి నుంచి పోషణ ఖర్చులు పొందే పూర్తి అర్హత ఉందని అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో తేల్చిచెప్పింది.

Also Read : బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు పెట్టాలి.. CECని అరెస్ట్ చేయాలి: మమత సంచలన డిమాండ్!