ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ మార్గమధ్యంలో కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోగా, తీవ్ర గాలింపు చర్యల అనంతరం ప్రమాద స్థలాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. ఈ దుర్ఘటన సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో సహా మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Also Read : ఏం చేసినా ఎన్‌కౌంటరే.. నాలుగు నెలల్లో 3 ఎన్‌కౌంటర్లు!

షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ హెలికాప్టర్ బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు టేకాఫ్ తీసుకుంది. అయితే, ప్రయాణం మొదలైన కాసేపటికే హతీ పర్వత్ ఏరియా వద్దకు చేరుకోగానే సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో ఆ ప్రాంతంలో భారీగా స్నో పడుతుండటంతో పాటు విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ప్రతికూల వాతావరణం, తీవ్రమైన స్నో ఫాల్ కారణంగానే పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో పాటు కమ్యూనికేషన్ సిస్టమ్ తెగిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

జోషిమఠ్‌కు సమీపంలోని చైయెన్ విలేజ్ అటవీ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురూ మరణించి ఉంటారని రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బలగాలతో పాటు ఇండియన్ ఆర్మీ బృందాలు సంయుక్తంగా స్పాట్‌కు చేరుకుని భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. సహాయక చర్యల కోసం అదనంగా మరో రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. అయితే, లోయ ప్రాంతం కావడం, నిరంతరం స్నో కురుస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలుగుతోందని గ్రౌండ్ లెవల్ ఆఫీసర్స్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : ‘ఫిట్స్’ నాటకమాడి జైలు నుంచి 17 మంది ఖైదీలు జంప్!