
Encounter : పశ్చిమ బెంగాల్లో వరుస ఎన్కౌంటర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. 12 గంటల వ్యవధిలోనే ఇద్దరు నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. ఇందులో ఒకరు మైనర్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసు నిందితుడు కాగా, మరొకరు BJP కార్యకర్త హత్య కేసులో ప్రధాన నిందితుడు.
Also Read : మాజీ మిస్ స్విట్జర్లాండ్‌పై.. డొనాల్డ్ ట్రంప్ అత్యాచారం!
అక్టోబర్ 27న మధ్యాహ్నం ముర్షిదాబాద్ జిల్లా షంసెర్గంజ్ పరిధిలోని ధూలియన్‌లో మొదటి ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 28న స్థానిక బీడీ కార్మికుడు, బీజేపీ వర్కర్ సుజిత్ మండల్ కిడ్నాప్, దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సమౌల్ షేక్ (40)ను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో అతను ఒక పోలీస్ ఆఫీసర్ సర్వీస్ వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించడంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడు. అంతకుముందు బాధితుడి కుటుంబానికి సరైన రక్షణ కల్పించలేదనే ఆరోపణలతో సీఎం సువేందు అధికారి స్థానిక పోలీస్ అధికారులపై సస్పెన్షన్లు, బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
దీనికి కేవలం 12 గంటల ముందే, ఉత్తర 24 పరగణాల జిల్లా గైఘాటాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో అరెస్టయిన ప్రహ్లాద్ దాస్ అనే నిందితుడు పోలీస్ రివాల్వర్ లాక్కొని తప్పించుకునే క్రమంలో చెరువులోకి దూకాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను హతమయ్యాడు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలో ఇలాంటి ఎన్కౌంటర్లు జరగడం ఇది మూడోసారి. గత జూలైలో కూడా ఓ మైనర్ బాలిక హత్య కేసు నిందితుడు ఇదే రీతిలో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ప్రస్తుతం ఈ రెండు తాజా ఎన్కౌంటర్ ఘటనలపై రాష్ట్ర పోలీసులు అధికారిక విచారణ ప్రారంభించారు.
Also Read : రిటైర్డ్ IPS భార్య హత్య కేసులో వీడిన మిస్టరీ.. నేపాల్ గ్యాంగ్ అరెస్ట్!









