
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ IPS అధికారి భార్య హత్య, దోపిడీ కేసును సిటీ పోలీసులు సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాలోని నలుగురు కీలక నిందితులను నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఏడాది మే 7 రాత్రి ప్రశాసన్ నగర్‌లోని రిటైర్డ్ IPS రాయ్ వినయ్ రంజన్ ఇంట్లో ఆయన భార్య తనుజా రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. యజమాని బెంగళూరు వెళ్లిన సమయం చూసి, ఇంట్లో పనిమనిషిగా చేరిన నేపాల్‌కు చెందిన ధర్మ అలియాస్ కల్పన తన ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చింది. పుణే, బెంగళూరుల నుంచి నగరానికి చేరుకున్న గ్యాంగ్ సభ్యులు.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. తనుజా రంజన్ నిద్రలేవడంతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం బీరువాలు పగలగొట్టి 225 గ్రాముల బంగారు నగల దోపిడీకి పాల్పడ్డారు. కాజీపేట వద్ద సొత్తును తొమ్మిది వాటాలుగా పంచుకుని నేపాల్‌కు పరారయ్యారు.
పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ముఠా నేరాల తీవ్రతను గమనించిన టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో స్పెషల్ సిట్ ఏర్పాటైంది. నిందితుల కోసం 5 నెలల పాటు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో క్యాంప్ వేసి నిఘా పెట్టారు. చివరికి సాంకేతిక ఆధారాల సాయంతో ప్రధాన సూత్రధారి పనిమనిషి ధర్మతో పాటు గణేష్ బి.కె, చంద్ర బహదూర్, గణేష్ బహదూర్ షాహిలను నాంపల్లి వద్ద అరెస్ట్ చేశారు. ఇదే ఆపరేషన్‌లో పలు చోట్ల 8 భారీ దొంగతనాలకు పాల్పడిన మరో నిందితుడు జీవన్ చంద్‌ను పట్టుకోవడంతో పాటు, 5 పాత వారెంట్లను అమలు చేశారు.
ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇళ్లలో పనిమనుషులు, వాచ్మెన్లను నియమించుకునేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని, వారి ఆధార్, బ్యాంక్ వివరాలతో పాటు ఐదుగురు బంధువుల వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు. వారి సమక్షంలో విలువైన వస్తువులు, ప్రయాణాల గురించి మాట్లాడవద్దని హెచ్చరించారు.









