
Donald Trump : ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మరింత పెంచుతున్నారు. వీకెండ్లో అమెరికా సైన్యం కొత్త దాడులు చేయకపోయినా.. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో వరుసగా AI ఆధారిత పోస్టులు పెట్టారు. ఏకంగా గంటలోనే 34 పోస్టులు పెట్టారు ట్రంప్. ఇరాన్ పూర్తిగా దెబ్బతింటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పోస్టుల్లో అమెరికా ఆధిపత్యాన్ని చూపించే గ్రాఫిక్స్ కనిపించాయి. ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోతున్నాయంటూ ఓ గ్రాఫిక్ పెట్టారు. అలాగే ఇరాన్‌కు కీలకమైన చమురు కేంద్రం ఖార్గ్‌పై దాడి చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు. మధ్యప్రాచ్య మ్యాప్‌లో ఇరాన్ ఆకారాన్ని ట్రంప్ ముఖం ఆకారంలో చూపించడం ఆసక్తికరంగా మారింది.
మరో పోస్టులో హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి చేరుకుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 1.8 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతోందని, యుద్ధానికి ముందు ఈ పరిమాణం 2 కోట్ల బ్యారెళ్లుగా ఉండేదని తెలిపారు. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురులో దాదాపు ఐదో వంతు రవాణా అవుతుంది. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.
ఇరాన్ చమురు ఎగుమతులు కుప్పకూలుతున్నాయని, దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉందని ట్రంప్ మరో గ్రాఫిక్‌లో పేర్కొన్నారు. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ కూడా భారీగా పడిపోయిందని చూపించారు. 2025 ప్రారంభంలో ఒక డాలర్‌కు సుమారు 9 లక్షల రియాల్స్ ఉండగా.. తాజా గణాంకాల్లో అది 22.7 లక్షలకు పైగా పడిపోయినట్లు గ్రాఫిక్‌లో చూపించారు. ఇక ట్రంప్ మరో AI చిత్రాన్ని కూడా షేర్ చేశారు. అందులో ఇరాన్‌లోని ఓ చమురు బావిపై విమానం బాంబులు వేస్తున్నట్లు చూపించారు. దానికి బై బై, ఖార్గ్ అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఇటీవలే హోర్ముజ్ జలసంధి పేరును ట్రంప్ స్ట్రెయిట్ గా మార్చాలనే ఆలోచనను కూడా ట్రంప్ ప్రస్తావించారు. అయితే కొన్ని గంటల తర్వాత తాను సీరియస్‌గా చెప్పలేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇతర దేశాలను ఆటపట్టించేలా అంతర్జాతీయ ప్రాంతాలు, సంస్థల పేర్లను మార్చే ప్రయత్నాలు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత కొనసాగుతున్నాయి.









