Egypt Earthquake :  ఈజిప్టు దేశంలో సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు. వెంటనే అలెర్ట్ అయిన అధికారులు అప్రమత్తమై అత్యవసర సహాయక చర్యల ప్రణాళికలను అమలు చేశారు. రాజధాని కైరోతో పాటు గాజా సరిహద్దులోని ఎల్-అరిష్ వరకు ఈ భూప్రకంపనలు సంభవించాయి. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

ఈజిప్టు నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ జియోఫిజిక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:00 గంటలకు సూయజ్ నగరానికి ఉత్తరంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. మొదట దీని తీవ్రతను 5.2గా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత దానిని 5.5గా సవరించారు. ఇక యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం ఈ భూకంప తీవ్రతను 5.0గా నమోదైందని వెల్లడించింది. భూమి ఉపరితలానికి చాలా తక్కువ లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

Also Read : ఇరాన్ కు బిగ్ షాక్.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

భూకంపం నేపథ్యంలో ఈజిప్టు ఆరోగ్య మంత్రి ఖలీద్ అబ్దెల్ ఘఫర్ దేశవ్యాప్తంగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు అంబులెన్స్ సేవలను పూర్తి అప్రమత్తంగా ఉంచాలని స్పష్టం చేశారు. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఈజిప్టు రెడ్ క్రాస్ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు.

ఈజిప్టులోని కొన్ని పాత, శిథిలావస్థకు చేరిన భవనాల దగ్గరకు ప్రజలు వెళ్లవద్దని ఈజిప్టు రెడ్ క్రాస్ హెచ్చరించింది. ముఖ్యంగా కైరో నగరంలోని శ్రామిక వర్గాల నివాస ప్రాంతాలలో ఇటువంటి పాత భవనాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈఈశాన్య ఆఫ్రికా దేశమైన ఈజిప్టులో ఇలాంటి తీవ్రమైన భూకంపాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి.

ఈ దేశ ఆధునిక చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన భూకంపం అక్టోబర్ 1992లో సంభవించింది. ఆ సమయంలో రాజధాని కైరోను 5.8 తీవ్రతతో కుదిపేసిన భారీ భూకంపం కారణంగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా భూకంపం ఆనాడు జరిగిన భయానక ఘటనలను మరోసారి ప్రజలకు గుర్తుచేసింది.

Also Read : ఘోర విమాన ప్రమాదం.. 13 మంది మృతి!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.