

-RAVI PRAKASH
Amyra : ఆ రోజు కూడా ఎప్పట్లాగే అమైరా క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెడుతుంది. ఆమె ప్రవర్తనలో ఎలాంటి చేంజెస్ కనిపించవు. కూల్‌గానే ఉంది. స్కూల్‌కు వచ్చిన మరో తొమ్మిదేళ్ల చిన్నారి ఎలా ఉంటుందో అచ్చం అలానే కనిపిస్తుంది. కొద్ది క్షణాల తర్వాత అమైరా స్నేహితుల్లో ఒకరు క్లాస్‌రూమ్‌లోకి వస్తారు. ఇద్దరూ పలకరించుకుంటారు. మామూలుగానే మాట్లాడుకుంటారు. వీడియో స్టార్టింగ్ లో కొన్ని నిమిషాలు చూస్తే ఈ చిన్నారి జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజు మొదలవుతోందని ఎవరికీ అనిపించదు. కొద్దిసేపటికి డ్యాన్స్ యాక్టివిటీ కోసం పిల్లలందరూ బయటకు వెళ్తారు. అమైరా కూడా ఇతర పిల్లలతో కలిసి పాల్గొంటుంది. చాలా యాక్టివ్‌గా డ్యాన్స్ చేస్తుంది. నవ్వుతుంది. చలాకీగా కనిపిస్తుంది. ఆ వీడియో మొదట్లో కాసేపు చూస్తే మరికొన్ని క్షణాల్లో ఇంత పెద్ద విషాదం జరగబోతోందని ఎవరూ ఊహించలేరు. డ్యాన్స్ కంప్లీట్ అయ్యాక పిల్లలంతా మళ్లీ క్లాస్‌రూమ్‌కు వస్తారు. మొదట్లో అన్నీ మామూలుగానే కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టేషనరీ వస్తువులతో ఆడుకుంటుంటారు. టేప్, ఇతర లెర్నింగ్ మెటీరియల్ ఒకరి నుంచి మరొకరికి ఇస్తూ కనిపిస్తారు. ఒక సందర్భంలో కత్తెరలా కనిపించే ఒక వస్తువు కూడా కొంతమంది పిల్లల చేతుల్లో కనిపిస్తుంది. అయినా అందులో టెన్షన్ పెట్టేలా ఏమీ కనిపించదు. కానీ అక్కడి నుంచే ఈ కేసులోని అతిపెద్ద మిస్టరీ మొదలవుతుంది.
కొంతమంది పిల్లలు ఒక డిజిటల్ రైటింగ్ స్లేట్‌ను బయటకు తీస్తారు. అమైరా కుటుంబం చెబుతున్న ప్రకారం ఆ వస్తువు క్లాస్‌రూమ్‌లో ఉండకూడదు. టీచర్ ఎదుటే ఆ స్లేట్‌ను బయటకు తీస్తారు. కొంతమంది పిల్లలు దానిపై ఏదో రాయడం ప్రారంభిస్తారు. ఆ స్లేట్‌పై ఏమి రాశారో ఆ క్లాస్‌రూమ్‌లో ఉన్న వారికి తప్ప బయట ఎవరికీ తెలియదు. పోలీసులు కూడా దాని వివరాలను ఇప్పటివరకు ఎక్కడా బయటపెట్టలేదు. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డిజిటల్ స్లేట్‌ను మళ్లీ మళ్లీ మళ్లీ అమైరాకు చూపిస్తుంటారు. ఆ క్షణంలోనే ఏదో మారిపోతుంది. క్లాస్‌రూమ్‌లో కాదు, అమైరాలో. అప్పటివరకు సహజంగా కనిపించిన ఆ చిన్నారి సడెన్‌గా మారిపోతుంది. ఆమె బాడీ లాంగ్వేజ్ పూర్తిగా చేంజ్ అవుతుంది. క్లాస్‌పై ఫోకస్ తగ్గిపోతుంది. ఆమె Inconvenientగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం డ్యాన్స్ చేస్తూ నవ్విన చిన్నారి ఇప్పుడు కనిపించదు. TENSION, CONFUSION, మానసికంగా కలత చెందిన చిన్నారిలా కనిపిస్తుంది. ఆమె చుట్టూ ఉన్న పిల్లలు మాత్రం ఆ డిజిటల్ స్లేట్‌తోనే ఆడుతూ ఉంటారు. వారి కదలికలు చూస్తుంటే ఆ స్లేట్‌ను పదేపదే అమైరాకే చూపిస్తున్నట్లు కనిపిస్తుంది.
Also Read : బెంగళూరు బిడదిలో భూ సర్వేను అడ్డుకున్న మహిళారైతులు..చీపుర్లు పట్టుకుని..
ఆ స్లేట్‌పై ఏమి రాశారో సీసీటీవీ చెప్పదు. పిల్లలు ఏమి మాట్లాడారో కూడా ఆ ఫుటేజ్ వెల్లడించదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అమైరా ఆ డిజిటల్ స్లేట్‌ను తీసుకునేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంది. చాలాసార్లు తన చేతిని స్లేట్ వైపు చాపుతూ ఉంటుంది. ఎందుకు? దానిపై ఏమి రాశారో చూడాలనుకుందా? లేదా అది ఇతరులకు కనిపించకుండా ఆపాలనుకుందా? లేదంటే తన గురించి ఏదైనా రాశారని భావించి దాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుందా? అమైరా మనసులో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఆ స్లేట్‌ను అందుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు మాత్రం సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అమైరా తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం ఇదే క్లాస్‌రూమ్‌లో జరిగిన వేధింపులకు ఫస్ట్ హింట్. దర్యాప్తు అధికారులు కూడా ఇదే నిర్ణయానికి వస్తారా లేదా అనేది దర్యాప్తు తేల్చాల్సిన అంశం. కానీ సీసీటీవీ మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కొద్ది నిమిషాల క్రితమే నవ్వుతూ కనిపించిన చిన్నారి ఇప్పుడు చాలా క్లియర్‌గా మానసిక ఆందోళనలో కనిపిస్తోంది.
అంతే కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే తర్వాతి గంటలో అమైరా మౌనంగా కూర్చోలేదు. ఎవరో తన మాట వినాలని, ఎవరో తనకు సహాయం చేయాలని ఆమె మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. ఇప్పుడు మీరు చూడబోయే సీన్స్ ఈ మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లోనే అత్యంత కీలకమైనవి. ఎందుకంటే మొదటిసారి అమైరా తన క్లాస్ టీచర్ వైపు నడిచి వెళ్తుంది. హెల్ప్ అడిగేందుకు ఆ ప్రయత్నాలకు ఎలాంటి రియాక్షన్ వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ దృశ్యాలు.
Also Read : వీధి కుక్కల బెడదకు చెక్.. కేరళ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ ‘సెన్స్-కె9’ స్మార్ట్ వాచ్!
అప్పటికే ఆ డిజిటల్ స్లేట్ క్లాస్‌రూమ్‌లో కనిపించినప్పటి నుంచి దాదాపు గంట సమయం గడిచిపోయింది. ఇప్పుడు మొదటిసారిగా అమైరా తన బెంచ్‌లో నుంచి లేచి నేరుగా క్లాస్ టీచర్ పునీతా శర్మ దగ్గరికి వెళ్తుంది. ఈ సీసీటీవీలో ఇది అత్యంత కీలకమైన క్షణం. ఎందుకంటే తొమ్మిదేళ్ల ఆ చిన్నారి సహాయం కోసం ప్రయత్నిస్తున్న తొలి దృశ్యం ఇదే. ఆమె మౌనంగా కూర్చోలేదు. ఏం జరుగుతుందో భరిస్తూ ఉండిపోలేదు. తన టీచర్ దగ్గరకు వెళ్లింది. ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. అమైరా తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం ఆమె చెప్పాలనుకున్నది ఆ డిజిటల్ స్లేట్ గురించే. అయితే ఈ సీసీటీవీకి ఆడియో లేదు. కాబట్టి అమైరా తన టీచర్‌కు ఏమి చెప్పిందో మనకు తెలియదు. కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ మాత్రం ఒక విషయాన్ని చెబుతోంది. తన టీచర్ జోక్యం చేసుకోవాలని, తనకు సహాయం చేయాలని, తనకు జరుగుతున్నదాన్ని ఆపాలని ఆమె కోరుతున్నట్టుగా కనిపిస్తోంది.
అయితే అక్కడే మరో ఇన్సిడెంట్ జరుగుతుంది. అమైరా ముందు బెంచ్‌లో కూర్చున్న మరో స్టూడెంట్ కూడా టీచర్ దగ్గరకు వస్తాడు. అమైరా వైపు చూపిస్తూ ఏదో చెబుతాడు. మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఫుటేజ్‌లో ఆడియో లేదు. అందువల్ల ఏం చెప్పాడో బయట ఎవరికీ తెలియదు. కానీ ఆ సీన్స్ మాత్రం ఒక్కసారిగా మరో మలుపు తిరుగుతాయి. హెల్ప్ కోసం టీచర్ దగ్గరకు వచ్చిన చిన్నారి ఇప్పుడు మరో విద్యార్థి ఫిర్యాదుకు కేంద్రంగా మారినట్లు కనిపిస్తుంది. అమైరా ఒంటరిగా నిలబడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అదే విద్యార్థి మళ్లీ అమైరా వైపు చూపిస్తూ ఇతర పిల్లలతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తాడు.
ఆ తర్వాత అమైరా కుటుంబం చెబుతున్న ప్రకారం క్లాస్‌రూమ్‌లో వేధింపులు మళ్లీ కొనసాగినట్లు అనిపిస్తుంది. అమైరా మరోసారి క్లాస్ టీచర్ పునీతా శర్మ దగ్గరికి వెళ్తుంది. మళ్లీ ఏదో వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఈసారి ఆమె బాడీ లాంగ్వేజ్ మరింత కలచివేస్తుంది. చేతులు జోడిస్తుంది. ఎవరినో వేడుకుంటున్నట్టుగా “మేడమ్… నా మాట వినండి…” అని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందరి ముందు చెప్పలేని ఏదో విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ అర్థం సరైందేనా కాదా అది దర్యాప్తు అధికారులు తేల్చాల్సిన అంశం. కానీ సీసీటీవీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చూపిస్తోంది. అమైరా మళ్లీ మళ్లీ మళ్లీ టీచర్ దగ్గరకే వెళ్తోంది. టీచర్ సహాయం కోరుతోంది.
Child psychologists చెబుతున్న ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్నారి పదేపదే తనకు నమ్మకమైన పెద్దవారి దగ్గరకు వెళ్లి మానసికంగా కలత చెందినట్లు కనిపిస్తే ఆ క్షణాన్ని అత్యంత సున్నితంగా తీసుకోవాలి. ఇది ప్రతి స్కూల్ బాధ్యత. ఆ చిన్నారిని వెంటనే ఇతర పిల్లల నుంచి కొంతసేపు దూరంగా తీసుకెళ్లడం, ప్రత్యేకంగా మాట్లాడటం, ఏం జరిగిందో తెలుసుకోవడం, క్లాస్‌రూమ్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అవసరమైతే స్కూల్ కౌన్సిలర్‌ను లేదా సీనియర్ సిబ్బందిని పిలవడం చేయాలి. అమైరా తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం ఇవేవీ జరగలేదు. అయితే ఈ ఆరోపణలను స్కూల్ యాజమాన్యం ఇప్పటివరకు అంగీకరించలేదు. ఈ అంశాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
కానీ సీసీటీవీ మాత్రం ఒక విషయాన్ని చూపిస్తోంది. అమైరా ఎలాంటి పరిష్కారం లేకుండానే మళ్లీ తన సీటుకు వెళ్లిపోతుంది. క్లాస్‌రూమ్‌లో ప్రెషర్ అలాగే కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇంతలో మరో విద్యార్థి టీచర్ దగ్గరకు వెళ్తాడు. ఫిర్యాదులు కొనసాగుతున్నట్లు కనిపిస్తాయి. మొదట హెల్ప్ అడిగిన చిన్నారే ఇప్పుడు తన తోటి విద్యార్థుల ఆరోపణల మధ్య నిలబడినట్టుగా కనిపిస్తుంది. అమైరా మళ్లీ టీచర్ దగ్గరకు వెళ్తుంది. తనవైపు కథను చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అదే సమయంలో మరో విద్యార్థిని ముందుకు పిలుస్తారు. అమైరాను తిరిగి తన సీటులో కూర్చోవాలని సూచించినట్టుగా కనిపిస్తుంది.
కొద్దిసేపటి తర్వాత టీచర్ మరోసారి అమైరాతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అమైరా మళ్లీ ముందుకు వస్తుంది. ఈసారి ఆమె బాడీ లాంగ్వేజ్ మరింత ఆవేదనను వ్యక్తం చేస్తోంది. తాను తప్పు చేయలేదని టీచర్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చేతులతో పదేపదే సైగలు చేస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. “నేను చేయలేదు…” అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ కొద్దికొద్దిగా ఆ క్లాస్‌రూమ్‌లోని వాతావరణం ఆమెకు వ్యతిరేకంగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె మరింత ఒంటరిగా కనిపిస్తుంది. మరింత మానసికంగా కుంగిపోతున్నట్టుగా కనిపిస్తుంది.
అంతలో ఈ కేసులో మరో కీలకమైన దృశ్యాన్ని సీసీటీవీ రికార్డ్ చేస్తుంది. టీచర్ అమైరా వైపు చేయి చూపిస్తూ గట్టిగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. మళ్లీ రిమైండ్ చేస్తున్నాం, ఈ ఫుటేజ్‌లో ఆడియో లేదు. కాబట్టి ఆ టైమ్‌లో ఏం మాట్లాడారో మనకు తెలియదు. కానీ ఆ సీన్లు మాత్రం ఒక విషయం చెబుతున్నాయి. అమైరా నిస్సహాయంగా కనిపిస్తోంది. తన మాట చెప్పేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తోంది. కానీ ప్రతిసారీ ఆ సంభాషణ ఆమె చేతుల్లోంచి జారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాతి కొన్ని నిమిషాలు ఈ మొత్తం సీసీటీవీ ఫుటేజ్‌లోనే అత్యంత హృదయవిదారకమైన క్షణాలుగా మారతాయి. ఆ తర్వాత జరిగేది ఈ కేసు మొత్తం దిశనే మార్చేస్తుంది. కొద్ది నిమిషాల్లోనే అమైరాబాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ దర్యాప్తులో ఇప్పటికీ సమాధానం దొరకని అత్యంత పెద్ద ప్రశ్నగా మిగిలిపోయాయి.
ఆ తర్వాత కొన్ని నిమిషాల్లో ఈ మొత్తం కేసులోనే అత్యంత కలచివేసే Visuals మనకు కనిపిస్తాయి. అమైరా ముందు బెంచ్‌లో కూర్చున్న ఒక Student మరోసారి తన సీటులో నుంచి లేస్తాడు. అమైరా వైపు చేయి చూపిస్తాడు. ఏదో చర్చ జరుగుతోంది. మళ్లీ మళ్లీ రిమైండ్ చేస్తున్నాం, ఈ సీసీటీవీలో ఆడియో లేదు. సో, అక్కడ ఏమి మాట్లాడారో మనకు తెలియదు. కొద్దిసేపటికి క్లాస్ టీచర్ కొంతమంది విద్యార్థుల దగ్గరకు వెళ్తారు. వారితో మాట్లాడుతారు. అందులో అమైరా వైపు కూడా చూపిస్తున్నట్లు సీసీటీవీలో కనిపిస్తుంది. అక్కడే ఈ కేసులో అమైరా తల్లిదండ్రులను, అలాగే ఈ ఫుటేజ్ చూసిన ఎంతోమందిని తీవ్రంగా కలచివేసిన దృశ్యం కనిపిస్తుంది. అమైరా ఉన్నట్టుండి రెండు చేతులతో నోటిని మూసుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత తన తలను చేతులతో పట్టుకుంటుంది. ముఖంలో షాక్ అవ్వడం కనిపిస్తుంది. తొమ్మిదేళ్ల చిన్నారి క్లాస్ రూమ్‌లో ఇలా రియాక్ట్ అవడం నార్మల్‌గా అనిపించదు. ఆమె బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోతుంది. ఎవరో చెప్పిన ఏదో విషయం తీవ్రంగా భయపెట్టినట్టుగా, మానసికంగా కుదిపేసినట్టుగా కనిపిస్తుంది. అదేంటి? ఎవరేమన్నారు? మనకు తెలియదు. ఎందుకంటే ఈ ఫుటేజ్‌లో ఆడియో లేదు. పోలీసులు కూడా ఆ సమయంలో జరిగిన సంభాషణ వివరాలను ఇప్పటివరకు బయటకు చెప్పలేదు.
అయితే అమైరా తల్లిదండ్రుల చెబుతున్నదాని ప్రకారం ఇదే ఈ కేసులో అత్యంత కీలకమైన క్షణం. వారి ఆరోపణల ప్రకారం ఆ సమయంలో జరిగిన పరిణామాలే అమైరాను తీవ్రంగా భయపెట్టాయని వారు భావిస్తున్నారు. ఈ ఆరోపణలను స్కూల్ యాజమాన్యం ఇప్పటివరకు అంగీకరించలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఆ తర్వాత జరిగినది మాత్రం సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తుంది. క్లాస్‌రూమ్‌లో చర్చ ఆగిపోలేదు. మరో విద్యార్థి టీచర్ దగ్గరకు వెళ్తాడు. మరోసారి అమైరా గురించే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత టీచర్ మళ్లీ అమైరాతో మాట్లాడుతారు. ఈసారి అమైరా తన సీటులోనే కూర్చుని రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలను ఎలాగైనా ఆపాలని ప్రతి కదలికలోనూ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొద్దిసేపటికి పైకి లేస్తుంది. మరో విద్యార్థి దగ్గరకు వెళ్తుంది. చేతులతో సైగలు చేస్తుంది. “ఏం జరుగుతోంది?” “నాపై ఎందుకు ఇలా చెబుతున్నారు?” అని అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది.
కానీ ఆ ప్రయత్నం తర్వాత కూడా అమైరా మనసు ప్రశాంతంగా మారలేదు. మరింత టెన్షన్‌కు లోనయినట్లుగా కనిపిస్తుంది. నెమ్మదిగా తిరిగి తన సీటు దగ్గరకు వస్తుంది. కానీ కూర్చోదు. కొన్ని క్షణాలు అలాగే నిలబడి ఉంటుంది. ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్‌గా పరిశీలిస్తే ఒక ప్రశ్న సహజంగానే మనసులో మెదులుతుంది. “ఇంకోసారి టీచర్ దగ్గరకు వెళ్లాలా?” అని ఆలోచించిందా? ఎందుకంటే ఆ తర్వాత అదే జరుగుతుంది. చివరిసారిగా అమైరా మరోసారి తన క్లాస్ టీచర్ దగ్గరకు వెళ్తుంది. చివరి ప్రయత్నం. చివరి విజ్ఞప్తి. చివరిసారి తన మాట వినిపించాలనే ప్రయత్నం. మరోసారి ఈ ఫుటేజ్‌లో ఆడియో లేదు. వారి మధ్య ఏం మాట్లాడారో మనకు తెలియదు. కానీ అక్కడి దృశ్యాల్లో మాత్రం టీచర్ రియాక్షన్ గట్టిగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అమైరా తల్లిదండ్రుల ఆరోపణల ప్రకారం ఈ సమయంలో తమ కుమార్తె తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తోందని వారు చెబుతున్నారు. అది వారి ఆరోపణ. ఈ అంశంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
అయితే ఆ తర్వాత అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. క్లాస్‌రూమ్‌లో సంభాషణ జరుగుతుండగానే అమైరా ఉన్నట్టుండి వెనక్కి తిరుగుతుంది. క్లాస్‌రూమ్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. మెల్లగా కాదు, మామూలుగా కూడా కాదు. స్పీడ్ గా కారిడార్‌లోకి అడుగుపెడుతుంది. కొన్ని సెకన్లలోనే పరుగెత్తడం మొదలు పెడతుంది. ఇప్పుడు సీసీటీవీలో కనిపించేది ఒంటరిగా, భయంతో స్కూల్ బిల్డింగ్ అంతా పరుగెత్తుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి. అమైరా వెంట ఏ విద్యార్థి వెళ్లినట్లు కనిపించదు. ఏ టీచర్ వెంటనే పరుగెత్తినట్టు కనిపించదు. ఏ సిబ్బంది అడ్డుకున్నట్లు కూడా కనిపించదు. అమైరా కుటుంబం విడుదల చేసిన సీసీటీవీ ప్రకారం ఆమె స్కూల్ భవనం నుంచి చివరకు నాలుగో అంతస్తుకు చేరుకుంటుంది. కుటుంబం ఆరోపణల ప్రకారం అమైరాకు మధ్యలో ఏ ఫ్లోర్ అటెండెంట్ అడ్డుకోలేదు. స్టాఫ్ నుంచి స్పందన కనిపించలేదని వారు చెబుతున్నారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ విషాదం జరిగింది.
ఇక్కడితో సీసీటీవీ స్టోరీ ముగుస్తుంది. కానీ అసలు దర్యాప్తు ఇక్కడి నుంచే మొదలవుతోంది. ఎందుకంటే ఈ కేసు నాలుగో అంతస్తులో ఏం జరిగిందన్న ప్రశ్నకే పరిమితం కాదు. ఆ క్లాస్‌రూమ్‌లో ఏం జరిగింది? తొమ్మిదేళ్ల చిన్నారి ఎందుకు పదేపదే తన టీచర్ దగ్గరకు వెళ్లింది? ఎందుకు ప్రతి నిమిషం మానసికంగా కుంగిపోతున్నట్టు కనిపించింది? ఆ డిజిటల్ స్లేట్‌పై అసలు ఏమి రాశారు? ఆ క్లాస్‌రూమ్‌లో ఏం మాట్లాడారు? ముఖ్యంగా ఈ విషాదాన్ని ముందే అడ్డుకునే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం నెక్ట్స్ పార్ట్‌లో సీసీటీవీని దాటి ముందుకు వెళ్తాం. సీబీఎస్ఈ తనిఖీలో ఏం బయటపడింది? పోలీసుల దర్యాప్తు ఎక్కడికి చేరుకుంది? అమైరా తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? స్కూల్ పిల్లల సెక్యూరిటీ సిస్టమ్స్‌పై ఇప్పుడు ఎందుకు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి?
అమైరా Parents కి ఈ పోరాటం తమ కుమార్తెను కోల్పోయిన రోజుతో ఆగలేదు. న్యాయం కోసం పోరాటం ఆరోజు నుంచే మొదలైంది. అమైరా తల్లి శివాని ఈ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని అంటున్నారు. పోలీసులను ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇప్పటికీ అత్యంత కీలకమైన ప్రశ్నలకు సమాధానం దొరకలేదని ఆమె ఆరోపిస్తున్నారు. శివాని చెబుతున్న ప్రకారం ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే ముగ్గురు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు మారిపోయారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్ చేశామో, ఎన్నిసార్లు కలిశామో లెక్కేలేదని, అయినా ఈ కేసులో వర్తించాల్సిన చట్టాలను ఇప్పటికీ చేయలేదని ఆమె ఆరోపిస్తున్నారు. శివాని మరో తీవ్రమైన ఆరోపణ కూడా చేశారు. ఈ కేసులో కొంతమందిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఇందు దూబే పాత్రపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఇవి అమైరా తల్లి చేసిన ఆరోపణలు. ఈ అంశాలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. సంబంధిత అధికారులు ఈ ఆరోపణలను బహిరంగంగా అంగీకరించలేదు.
శివాని మరో కీలకమైన ప్రశ్న కూడా అడుగుతున్నారు. తొమ్మిదేళ్ల చిన్నారి స్కూల్ బిల్డింగ్ మొత్తం దాటుకుంటూ Fourth Floor వరకు వెళ్లగలిగితే మధ్యలో ఎవరూ ఎందుకు గమనించలేదు? ఆమె మాటల్లో ఆ రోజు కనీస పర్యవేక్షణ వ్యవస్థే విఫలమైందని ఆమె భావిస్తున్నారు. సీసీటీవీ మానిటరింగ్ కరెక్టుగా జరిగి ఉంటే, తగిన పర్యవేక్షణ ఉండి ఉంటే తమ కుమార్తె నాలుగో అంతస్తు వరకు చేరుకునే పరిస్థితి వచ్చేదే కాదని ఆమె అంటున్నారు. ఆ తర్వాత ఈ మొత్తం కేసులోనే అత్యంత హృదయవిదారకమైన మాటలను ఆమె చెబుతున్నారు. ప్రతిరోజూ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, ఆ రోజు జరిగిన విషయాలు చెబుతారు, ఎవరైనా బాధపెడితే అమ్మానాన్నలతో పంచుకుంటారు, ఏడుస్తారు, కంప్లయింట్ చేస్తారు. కానీ అమైరాకు ఆ అవకాశం కూడా దక్కలేదని ఆమె అంటున్నారు. ఆ రోజు అమైరా ఇంటికి తిరిగి వచ్చి ఉంటే ఈ విషాదం జరిగేదే కాదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ తమ వాదనకు బలం చేకూరుస్తోందని కూడా శివాని చెబుతున్నారు. ఆ ఫుటేజ్‌లో అమైరా పదేపదే సహాయం కోరిందని, తన మాట వినిపించేందుకు ప్రయత్నించిందని, తనను తాను వివరించుకోవాలని ప్రయత్నించిందని ఆమె తల్లి చెబుతున్నారు. అమైరా తాను చిక్కుకుపోయినట్టుగా, అవమానానికి గురైనట్టుగా, భయపడినట్టుగా భావించిందని శివాని చెబుతున్నారు. వ్యూవర్స్‌కు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఇవన్నీ అమైరా కుటుంబం చేస్తున్న ఆరోపణలు. ఈ కేసులో ఇప్పటికీ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ పూర్తికాలేదు.
అమైరా తండ్రి విజయ్ కూడా ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ దర్యాప్తులో Influencers జోక్యం ఉందని ఆయన ఆరోపించారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే తుది నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. కానీ ఎనిమిది నెలలు గడిచిపోయినా ఈ కేసులో అతి పెద్ద ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. ఆ డిజిటల్ స్లేట్‌పై అసలు ఏమి రాశారు? ఆ క్లాస్‌రూమ్‌లో నిజంగా ఏమి జరిగింది? అమైరా తన టీచర్‌కు ఏం చెప్పింది? ఆమెకు తిరిగి ఏమి చెప్పారు? కొద్ది నిమిషాల్లోనే ఆమె బాడీ లాంగ్వేజ్ ఎందుకు పూర్తిగా మారిపోయింది? ఎందుకు ఆమె పదేపదే తన టీచర్ దగ్గరకే వెళ్లింది? ముఖ్యంగా ఈ విషాదాన్ని ముందే ఆపే అవకాశం ఉండేదా?
ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు ఆ సీసీటీవీని చూస్తే ఈ కథ నాలుగో అంతస్తు వైపు పరుగెత్తిన చిన్నారితో మొదలుకాదు. ప్రతి రోజు లాగే నవ్వుతూ స్కూల్‌లోకి అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల చిన్నారితో మొదలవుతుంది. ఆ తర్వాత ఒక గంటలో ఏదో మారిపోయింది. ఏం మారింది? అదే ఇప్పటికీ ఈ కేసులోని అతి పెద్ద మిస్టరీ. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చట్టపరమైన బాధ్యత ఎవరిపై ఉందో చివరికి న్యాయస్థానాలే నిర్ణయిస్తాయి. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏదైనా కావచ్చు, ఈ ఘటన దేశంలోని ప్రతి స్కూల్ ముందు కొన్ని కఠినమైన ప్రశ్నలను నిలబెడుతోంది.
పాఠశాలల్లో యాంటీ బుల్లీయింగ్ సిస్టమ్స్ నిజంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? ఒక చిన్నారి మానసికంగా కుంగిపోతుంటే దాన్ని గుర్తించే శిక్షణ ఉపాధ్యాయులకు ఉందా? ఒక పిల్లవాడు లేదా ఓ చిట్టితల్లి పదేపదే సహాయం కోరితే చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ వెంటనే అమల్లోకి వస్తుందా? అత్యవసర పరిస్థితిలో భయంతో ఉన్న చిన్నారి ఒంటరిగా మిగిలిపోకుండా చూసేందుకు మన స్కూల్స్ నిజంగా సిద్ధంగా ఉన్నాయా? ఎందుకంటే కొన్నిసార్లు హెల్ప్ కావాలనే The largest Appeal మాటల్లో వినిపించదు, ఒక చిన్నారి బాడీ లాంగ్వేజ్‌లో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేసు గురించి దేశమంతా అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, ప్రాణాలు బలితీసుకోకముందే అమైరా సహాయం కోరుతోందని నిజంగా ఎవరైనా గుర్తించారా?








