
Terror Module Arrests :గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇటీవల జరిపిన మెరుపు దాడుల్లో పాకిస్థాన్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘జైషే మహమ్మద్’కు చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు పట్టుబడటం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. భారత్‌లో భారీ మారణహోమానికి వ్యూహం రచించిన ఈ ముఠా నెట్‌వర్క్‌ను భద్రతా బలగాలు చాకచక్యంగా బట్టబయలు చేశాయి. అరెస్టయిన నిందితులను బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖి, మహమ్మద్ హసన్ కరాడియా, మహమ్మద్ సునాసరగా గుర్తించారు. నిందితులకు స్థానిక న్యాయస్థానం జూలై 24 వరకు పోలీసు కస్టడీ విధించడంతో నిఘా సంస్థలు విచారణను మరింత వేగవంతం చేశాయి.
ఈ ఆపరేషన్‌లో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, నిందితులలో ఒకరు నగరంలో అమర్చడానికి అత్యంత ప్రమాదకరమైన ‘టైమ్ బాంబు’ను అసెంబుల్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. పేలుడు పదార్థాల తయారీలో అధునాతన శిక్షణ పొందిన సదరు నిందితుడు బాంబును పూర్తి చేసే తుది దశలో ఉండగా ఏటీఎస్ బృందాలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. గతంలో వీరు ఒక ఐఈడీ బాంబును ప్రయోగాత్మకంగా పరీక్షించి విఫలమైనట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి నుంచి ఉర్దూ భాషలోని తీవ్రవాద సాహిత్యం, సాంకేతిక మాన్యువల్స్, దాచి ఉంచిన బాంబు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఉగ్రవాద మాడ్యూల్ వెనుక పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్లా, మహమ్మద్ ఉమర్ అనే హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, భారీగా నిధులు సమకూర్చడం వీరి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. దేశంలో పేలుళ్లకు ఉపయోగించేందుకు ఒక పాత కారును కొనుగోలు చేయాలని పాక్ హ్యాండ్లర్లు ఆదేశించినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. నిందితుల నుంచి దాదాపు 250కి పైగా జిహాదీ డిజిటల్ ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
‘దారుల్ ఇస్లాం గుజరాత్ జైషే మహమ్మద్’ పేరుతో సాగుతున్న ఈ స్లీపర్ సెల్‌పై జరిగిన మూడో విడత దాడుల్లో భాగంగానే ఈ తాజా అరెస్టులు జరిగాయి. దీనితో ఈ కేసులో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న మొత్తం నిందితుల సంఖ్య 18కి చేరింది. అంతకుముందు గుజరాత్‌లోని బనస్కాంత, పటాన్, నవసారితో పాటు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో అర్ధరాత్రి వేళల్లో సాగిన ఆపరేషన్లలో ఎనిమిది మంది పట్టుబడగా, వారిని విచారించగా వచ్చిన సమాచారంతో మిగిలిన వారిని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో ఇద్దరు నిందితులు జమ్మూకశ్మీర్‌కు వెళ్లి ఏకే-47 అసాల్ట్ రైఫిల్ వినియోగం, పేలుడు పదార్థాలు, ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల తయారీ సహా మొత్తం 40 రకాల ఉగ్ర నైపుణ్యాల్లో శిక్షణ పొందినట్లు ఏటీఎస్ వెల్లడించింది. విదేశీ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు వడోదరకు వెళ్లి ఒక కశ్మీరీ యువకుడిని కలిసి లాజిస్టిక్ ఏర్పాట్లపై చర్చించినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, వీరు ఇప్పటికే 8 వేర్వేరు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల పరీక్షలు నిర్వహించి, మిగిలిన సోడియం ఫాస్ఫేట్, వైర్లను చెత్తకుండీల్లో పారేయగా, ఫోరెన్సిక్ బృందాలు వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపాయి.
మరోవైపు విదేశీ హ్యాండ్లర్ల నుంచి రూ. 3 లక్షల నిధులు అందుకున్న ఈ ముఠా, ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అహ్మదాబాద్‌లోని ఒక గార్డెన్ తరహా హోటల్‌ను ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని రెక్కీ నిర్వహించింది. హోటల్‌ను పరిశీలిస్తున్న సమయంలోనే ఏటీఎస్ అధికారులు వీరిని ఉచ్చు బిగించి పట్టుకున్నారు. నిందితుల స్థావరాలపై జరిపిన సోదాల్లో 43 జిహాదీ పుస్తకాలు, డిజిటల్ మాన్యువల్లు లభ్యమవ్వగా, ఖడియాసన్లోని ఓ మదర్సాలో యువత బ్రెయిన్ వాష్ చేయడానికి వీటిని వాడుతున్నట్లు తేలింది. ఈ అంతర్జాతీయ ఉగ్ర లింకులు, నిధుల లావాదేవీలపై దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు, నిందితులను మెహసానా జిల్లాలోని కడి కోర్టులో హాజరుపరిచారు.









