Crime : ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలోని గోమతి నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గురువారం పట్టపగలే ఒక ప్రైవేటు బ్యాంకులో ఉన్నతాధికారిగా పని చేస్తున్న తన భార్యను బ్యాంకు ఎదుటే కాల్చి చంపాడో భర్త, అనంతరం కొద్ది నిమిషాల్లోనే తన సోదరిని హతమార్చి, తాను తుపాకీతో కాల్చుకు ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ అత్యంత సంచలనాత్మక డబుల్ మర్డర్, ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడిని మానస్ వాజ్‌పేయిగా పోలీసులు గుర్తించారు. అతను కూడా ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు.

Also Read : మంత్రి కొండా సురేఖకు మరో షాక్‌… మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు

మానస్‌ వాజ్‌పేయి, గోమతి నగర్‌లోని ఐసీసీఈ బ్యాంక్‌ బయట తన భార్య దివ్య మిశ్రాపై గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన దివ్యను స్థానికులు లోహియా ఆసుపత్రికి తరలించగా , ఆమె అప్పటికే మరణిమచినట్టు వైద్యులు దృవీకరించారు. కాల్పుల అనంతరం మానస్‌ తన నివాసానికి పారిపోయాడు. అక్కడ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తన 28 ఏళ్ల సోదరి శివ వాజ్‌పేయిని కూడా కాల్చి చంపాడు. ఆపై తాను కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలు, విడాకుల పిటిషన్, అనుమానమే ఈ ఘోరానికి మూలకారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా ఈ దారుణ హత్య లక్నోలోని వివేక్ ఖండ్‌ ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ శాఖ ముందు జరిగింది. దివ్య మిశ్రా ఈ ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆమె ఒక క్లయింట్‌ సమావేశాన్ని ముగించుకొని బ్యాంకుకు తిరిగి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. లక్నో అడిషనల్‌ డీసీపీ అమోల్‌ ముర్కుట్‌ తెలిపిన వివరాల ప్రకారం, ” దివ్య క్లయింట్‌ మీటింగ్‌ ముగించుకొని బ్యాంక్‌కు చేరుకోగానే ఆమె భర్త మానస్ ఆమెను బయటకు రమ్మని పిలిచి మాట్లాడాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వీరిద్ధరూ బ్యాంకు వెలుపల కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్నారన్నారు. ఇద్దరి మధ్య మాటలు జరిగిన కొద్దిసేపటికే తీవ్ర ఆగ్రహాన్ని గురైన మానస్, తనవెంట తెచ్చుకున్న తుపాకీతో దివ్యపై కాల్పులు జరిపి ఘటన స్థలం నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్ధంతో ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన దివ్యను వెంటనే సమీపంలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుప్రతికి తరలించారు. అయితే ఆమె ఆసుపత్రికి చేరుకునే సరికి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.

Also Read : శివాలయంలో తొక్కిసలాట: ఏడుగురు భక్తులు మృతి, పలువురికి గాయాలు!

భార్యను చంపిన అనంతరం మానస్ ఇంటికి వచ్చి తన సోదరిపై కూడా కాల్పులు జరపడంతో ఆమె కూడా మరణించింది. అనంతరం మానస్ తనపై తాను కాల్పులు జరుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు మానస్‌ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు. ‘నన్ను మోసం చేసిన భార్యను ఈ రోజు చంపేశా. ఇప్పుడు నా సోదరిని చంపి నేను చనిపోవాలి. నా భార్య సోదరి ప్రజ్ఞ, భరత్‌కు అన్నీ తెలుసు’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ స్టేటస్‌ను చూసి అప్రమత్తమైన పొరుగింటి వ్యక్తి మానస్ ఇంటికి వెళ్లి చూడగా వారిద్దరూ విగత జీవులుగా కనిపించారు. మానస్‌, తాను లేకపోతే మానసిక రోగి అయిన తన సోదిరిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే భావనతోనే కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఈ ఘోరానికి పాల్పడటానికి ముందు అతను రాసినట్టు భావిస్తున్నట్టు వాట్సాప్ స్టేటస్‌ కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.