
Instagram Trap : సోషల్ మీడియా వేదికగా పరిచయాలు పెంచుకుంటూ, ప్రేమ పేరుతో మైనర్ బాలికలు, యువతులను ముగ్గులోకి దించి మోసాలకు పాల్పడుతున్న ఒక కిలాడీ నేరస్థుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలింనగర్లో నివాసముండే మామలకుంట పవన్ అలియాస్ తరుణ్ (22) అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ, ఖరీదైన బైక్‌లు ఉన్నట్లు భ్రమింపజేస్తూ సెక్స్ట్రాప్లకు తెగబడుతున్నట్లు విచారణలో తేలింది. గత ఆరు నెలల వ్యవధిలోనే ఐదారు మంది యువతులతో ఒకేసారి ప్రేమ వ్యవహారాలు నడుపుతూ శారీరకంగా లోబరుచుకోవడంతో పాటు, వారి వద్ద నుంచి బంగారం, డబ్బులు కాజేసి పరారవ్వడం ఇతని నైజంగా మారింది.
నిందితుడి నేర చరిత్రను పరిశీలిస్తే, గతంలోనూ ఇతనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోక్సో (POCSO) కేసు నమోదైనట్లు వెల్లడైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జూబ్లీహిల్స్ పరిధిలోని ఒక ఇంట్లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికను లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడటంతో అరెస్టయి, రెండు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చినా ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోగా, బంజారాహిల్స్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఈ ఘటనపై ఫిబ్రవరి 3న బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పోక్సోతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలోనే పరారీలో ఉన్న పవన్, జడ్చర్ల ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించి నాలుగు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకుని అక్కడే నివాసముంటున్నాడు. బంజారాహిల్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు, ఇన్‌స్టాగ్రామ్‌లో లభించిన సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి స్నేహితుడి అకౌంట్‌ను ట్రేస్ చేశారు. ఆ స్నేహితుడి పోస్టుల ద్వారా పవన్ పెళ్లి చేసుకున్న యువతి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, దాని ఆధారంగా ఆమె ఫోన్ నంబర్‌ను సేకరించి, నిందితుడు జడ్చర్ల సమీపంలో ఉన్నట్లు గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల లోతైన విచారణలో పవన్ తీరు ఇటీవల హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ‘రిచ్ కిడ్స్ సెక్స్ట్రాప్’ వ్యవహారాన్ని తలపించేలా ఉందని తేలింది. సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ మైనర్లను టార్గెట్ చేయడం, శారీరకంగా లోబరుచుకున్న తర్వాత పెళ్లి సాకుతో లేదా అత్యవసరాల పేరుతో ఆస్తులు దండుకోవడం ఇతని ప్రధాన వ్యూహం. కేవలం లైంగిక దాడులే కాకుండా ఇతనికి చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి ఇతర నేరాల్లోనూ భాగస్వామ్యమున్నట్లు పాత రికార్డుల ద్వారా పోలీసులు గుర్తించారు.
ఈ కేసును అత్యంత సమర్థవంతంగా ఛేదించి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సుభాష్, కానిస్టేబుల్ దత్తులను పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించగా, ఇతని చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ తరహా ఘటనల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వారి ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ చూసి మోసపోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. మైనర్ బాలికలు సైబర్ నేరగాళ్లు, సెక్స్ట్రాపర్ల వలలో పడకుండా అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు.









