YS Sharmila Surgery
YS Sharmila Surgery

ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇన్ని రోజులు మీడియా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడానికి గల అసలు కారణం బయటపడింది. తీవ్ర అనారోగ్యంతో తాజాగా ఆమె సర్జరీ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు షర్మిల హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమెకు ఏమైంది?.. అనే విషయానికొస్తే..

ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటున్నారు. అధికార కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్ష వైసీపీ గత పాలనపై ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటున్నారు. అలాంటి లీడర్.. గత కొన్ని రోజులుగా ఎవ్వరికీ కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు, ఇతర రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపించకపోవడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఎలాంటి ఆందోళనల్లోనూ ఆమె పాల్గొనలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాను హాజరుకాలేకపోవడానికి గల అసలైన కారణాన్ని షర్మిల వివరించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు.

ఈ మేరకు హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ ఒక పోస్టు పెట్టారు. ‘‘నాకు ఇటీవల ఉదర సంబంధిత సర్జరీ(అబ్డామినల్ సర్జరీ) విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం నాకు బాగానే ఉంది. చాలా త్వరగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న శ్రేయోభిలాషులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు నా ధన్యవాదాలు’’ అంటూ షర్మిల తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఆమెకు సర్జరీ జరగడంతోనే ఇన్నిరోజుల పాటు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని పలువురు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు షర్మిల త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి రావాలని రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.