బీహార్‌లోని సివాన్ జిల్లాలో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ఒక అక్రమ బాణసంచా తయారీ యూనిట్ అలాగే గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో భయానక వాతావరణం నెలకొంది. మహమ్మద్ అమీరుద్దీన్ మియాన్‌కు చెందిన ఈ ఫైర్‌క్రాకర్స్ యూనిట్‌లో మొదలైన నిప్పు, అక్కడ నిల్వ ఉంచిన భారీ పేలుడు పదార్థాలకు అంటుకోవడంతో వరుస పేలుళ్లు సంభవించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో లోపల భారీగా బాణసంచా నిల్వ ఉండటంతో దాదాపు రెండు గంటల పాటు నిరంతరాయంగా పేలుళ్లు కొనసాగాయి. ఆ శబ్దాల ధాటికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. బ్లాస్ట్ తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ బిల్డింగ్ ముందు భాగం పూర్తిగా పేలిపోయి, కాంక్రీట్ శిథిలాలు పక్కనే ఉన్న మెయిన్ రోడ్డుపై పడ్డాయి.

ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. పేలుడు సంభవించిన సమయంలో బిల్డింగ్‌లో పలువురు కార్మికులు, ఇతర వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. బ్లాస్ట్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండవచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : చైనాకు చెక్: అరుణాచల్ సరిహద్దుల్లో ‘శౌర్య కమాండోల’ దూకుడు!

సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది, పోలీసులు

సమాచారం అందుకున్న వెంటనే లోకల్ పోలీస్ టీమ్స్, ఫైర్ ఇంజిన్లు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తున్నారు. అసలు అగ్నిప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఏమిటి? ఈ యూనిట్‌కు అనుమతులు ఉన్నాయా లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : AP Municipal Elections: రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే