Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan : జంతర్‌మంతర్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ప్రధాని నరేంద్ర మోదీపై కొందరు చేసిన విమర్శల పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నవతరం (జెన్-జీ) ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ సీరియస్ అయ్యారు. దేశం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ప్రధానమంత్రిని అంతటి ఘోరమైన మాటలతో విమర్శించడం తనను ఎంతగానో బాధించిందని, సేవ చేసే నాయకుల పట్ల నేటి యువతకు సరైన సంస్కారాన్ని, విలువలను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : భోగాపురం ఎయిర్ పోర్ట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని

ప్రపంచ వేదికపై భారత్ కీర్తిని చాటుతున్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రమ, ఆయన పడుతున్న కష్టం కొత్త తరానికి సరిగ్గా తెలియడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. సమకాలీన ప్రపంచంలో మోదీని మించిన దిట్టమైన నాయకుడు మరొకరు లేరని, భవిష్యత్తులో కూడా ఆయన స్థాయి నేత రాబోడని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతను గౌరవించాల్సింది పోయి, అనకూడని మాటలు అనడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సాధారణంగా ఒక చిన్న కుటుంబాన్ని నడిపించాలన్నా, నిర్వహించాలన్నా ఎంతో కష్టంతో కూడుకున్న విషయమని, అలాంటిది విభిన్న సంస్కృతులు కలిగిన 140 కోట్ల భారీ జనాభా ఉన్న సువిశాల భారతదేశాన్ని సమర్థవంతంగా నడిపించడం సామాన్యమైన విషయం కాదని పవన్ గుర్తుచేశారు. ప్రధాని మోదీ ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ దేశాన్ని ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యం దిశగా ఎంతో దార్శనికతతో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.

విమర్శలు చేసే క్రమంలో సంస్కారాన్ని మర్చిపోకూడదని, దేశ సంక్షేమం, రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడికి ప్రజలంతా, ముఖ్యంగా నేటి యువత అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా దేశ ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన తీరును ఖండిస్తూ.. జాతీయ ప్రయోజనాల కోసం నిలబడే ఏకైక నాయకుడు మోడీయేనని, ఆయన నాయకత్వంలోనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.

Also Read : భోగాపురం ఎయిర్‌పోర్టు.. ఎయిరిండియా కీలక ప్రకటన!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.