Ships hijacked : సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు హైజాక్‌ కు గురయ్యాయి. ఆ రెండు నౌకల్లోనూ భారతీయులు ఉండటం కలకలం రేపింది. యెమెన్, సోమాలియా తీర ప్రాంతంలో జరిగిన ఈ రెండు వేర్వేరు ఘటనల్లో.. 22 మంది భారతీయులతో ప్రయాణిస్తోన్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేసినట్లు తెలుస్తోంది. నౌకల హైజాక్‌ విషయాన్ని సోమాలియా షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 17న సోమాలియా తీరంలో కామెరూన్ పతాకంతో వెళ్తోన్న ‘లుటుఫ్’ అనే కార్గో నౌకను కొంతమంది సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. తుర్కియేకు సంబంధించిన ఆయుధాలను తరలిస్తోన్న ఈ నౌకలో 10 మంది సిబ్బంది ఉన్నారు.. వారిలో ఆరుగురు భారతీయులుండగా.. మిగిలిన వారు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారని అధికారులు వెల్లడించారు. మొగదిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్, శాటిలైట్ పరికరాలను ఈ నౌక తరలిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో నౌక సోమాలియా తీరానికి చేరుకోగానే రెండు చిన్న పడవల ద్వారా నౌకలలోనికి ప్రవేశించిన 8మంది సాయుధులు సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుని నౌకను హైజాక్‌ చేశారు.

మరో ఘటనలో ఆగస్టు 20న యెమెన్ తీరం సమీపంలో మరో నౌక హైజాక్‌ కు గురైంది. ఎరిట్రియా జెండాతో వెళ్తోన్న ‘ఎం టి సిబు 1’ అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్‌ను కొంతమంది సముద్ర దొంగలు హైజాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 20మంది సిబ్బంది ఉండగా వారిలో 16మంది భారతీయులు… మిగిలిన నలుగురు సిరియా, సూడాన్, ఇరాక్‌లకు చెందిన వారని అధికారులు తెలిపారు. బాధితులంతా ప్రస్తుతం పైరెట్స్‌ చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సముద్రపు దొంగల నుంచి నావికులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటివరకు స్పందించలేదు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.