
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి APPSC జాబ్ క్యాలెండర్ 2026 ను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ మొత్తం ప్రక్రియను నాలుగు విడతల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసింది.
మొదటి దశలో 1,523 పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యాశాఖ ద్వారా ఇప్పటికే విడుదల చేసిన ప్రకటన జారీ చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఇక రెండో దశ కింద మొత్తం 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న ప్రకటన రానుంది. దీని పరిధిలోనే గ్రూప్-1 పోస్టులతో పాటు పోలీస్, అటవీ శాఖ, పశుసంవర్ధక తదితర కీలక శాఖల భర్తీకి అడుగు పడనుంది.
మూడో విడతలో 2,311 ఖాళీల భర్తీకి గానూ అక్టోబర్ 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. గ్రూప్-2 పోస్టులతో పాటు ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖల్లోని ఉద్యోగాలను ఈ దశలోనే నింపుతారు. మరోవైపు నాలుగో దశలో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీఎస్సీ ద్వారా 2,995 టీచర్, ఇతర విద్యాశాఖ పోస్టులకు అక్టోబర్ 15న ప్రత్యేక ప్రకటన విడుదల కానుంది.
ఈ జాబ్ క్యాలెండర్లో APPSC Portal ద్వారా భర్తీ చేసే గ్రూప్-1 పరిధిలో 149 పోస్టులు, గ్రూప్-2లో 673 పోస్టులు చోటు దక్కించుకున్నాయి. విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలు సహా 2,995 పోస్టులు రాబోతున్నాయి. వీటితో పాటు పోలీస్, ఫైర్, జైళ్ల శాఖ, ఫారెస్ట్, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, డిస్కంల పరిధిలో ఖాళీలు భర్తీ కానున్నాయి.









