Harvard University :అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి నాలుగేళ్ల అడ్మిషన్ కాలపరిమితి నిబంధన మరో నెలలో అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి కీలక సూచన చేసింది. కొత్త రూల్స్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలోపే అమెరికాకు చేరుకోవాలని యూనివర్సిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్సిటీ పిలుపునిచ్చింది. ఎఫ్-1 స్టూడెంట్స్‌తో పాటు జే-1 విద్యార్థులు, జే-1 స్కాలర్లనూ కూడా యూనివర్సిటీ ఈ మేరకు అప్రమత్తం చేసింది.

అమెరికాలో ట్రంప్ సర్కారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల విద్యార్థుల చదువులకు సంబంధించి నాలుగేళ్ల గరిష్ఠ కాలపరిమితిని అమల్లోకి తీసుకువచ్చారు. చదువు పూర్తి చేసుకునేందుకు నాలుగేళ్లు మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ అంతకుమించి సమయం కావాలనుకున్న వారు ఎవరన్న ఉంటే వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. గతంలో ఉన్న నిబంధన ప్రకారం యూనివర్సిటీ నిర్ణయం మేరకు విద్యార్థులకు కోర్సు పూర్తి చేసేందుకు అదనపు సమయం ఉండేది. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆ దేశం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈ మినహాంపుల ప్రకారం సెప్టెంబర్ 15 నాటికే యూఎస్‌కు చేరుకున్న అంతర్జాతీయ విద్యార్థులు తమ కాలపరిమితి పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది.

అయితే, కాగా ఆయా యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు సెలవులు లేదా ఇతరత్రా కారణాలతో సొంత దేశాలకు వెళ్తే వారు సెప్టెంబర్ 15 లోపు తిరిగి అమెరికా చేరుకోవాలి. లేదని తరువాత తిరిగి వెళ్లితే మాత్రం వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కోర్సు పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం కావాల్సి వస్తే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇందుకు అదనపు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందని ఈ నిబంధన చెప్తోంది. వీసా గ్రేస్ పీరియడ్‌కు సంబంధించి కూడా అనేక మార్పులు రానున్నాయి. సెప్టెంబర్ 15 నాటికి అమెరికాలో ఉంటున్న అమెరికా ఎఫ్-1 వీసా విద్యార్థులకు మునుపటి లాగే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ, సెప్టెంబర్ 15 తరువాత అమెరికాకు వెళ్లిన ఎఫ్-1 వీసా విద్యార్థులకు మాత్రం గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు కుదించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.