Pakistan : పాకిస్తాన్ ప్రభుత్వం ఆగస్టు 19, 20 తేదీల్లో తమ దేశానికి చెందిన దాదాపు 750 కిలోమీటర్ల పొడవైన వైమానిక ప్రాంతంలో విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ అత్యవసర నోటామ్ జారీ చేసింది. సాధారణ సైనిక విన్యాసాలకు ఎయిర్‌స్పేస్ మూసివేయడం సాధారణమే అయినప్పటికీ, 750 కి.మీ. మేర ఇంత భారీ ప్రాంతాన్ని బంద్ చేయడం వెనుక ఏదో పెద్ద క్షిపణి లేదా రాకెట్ వ్యవస్థ పరీక్ష ఉండి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అనుమానిస్తున్నారు.

ముఖ్యంగా పాకిస్తాన్ వద్ద ఉన్న ఫత క్షిపణి సిరీస్‌కు చెందిన కొత్త వెర్షన్‌ను పరీక్షించేందుకే ఈ ఏర్పాట్లు చేసి ఉండవచ్చని సమాచారం. పాక్ వద్ద ఇప్పటికే ఫతః-1, ఫతః-2 మిసైళ్లు ఉండగా, ఫతః-4 గురించిన నివేదికలు కూడా గతంలో వచ్చాయి. ఫతః-3, ఫతః-5 అని పిలిచే క్షిపణుల గురించి ప్రకటించినప్పటికీ వాటి వివరాలు రహస్యంగా ఉన్నాయి. యుద్ధ విమానాలపై మాత్రమే ఆధారపడకుండా దూరప్రాంతాల్లోని శత్రు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించేందుకు పాకిస్తాన్ ఈ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ను కూడా ఏర్పాటు చేసింది.

ఈ మిసైల్ పరీక్షల వార్తలకు ముందు ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం జరిగింది. ఇండియాలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇటీవల శ్రీనగర్ సందర్శించి, జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అత్యంత ముఖ్యమైన భాగమని ఆయన తెలిపారు.

అమెరికా రాయబారి చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్ విదేశాంగ శాఖ అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేసింది. ఈ వివాదం జరిగిన వెంటనే పాకిస్తాన్ 750 కి.మీ. ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తూ నోటామ్ జారీ చేయడంతో, తమ నిరసనను చూపించుకోవడానికే పాక్ ఈ నిర్ణయం తీసుకుందా అనే చర్చ కూడా నడుస్తోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.