
Iran: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఒక కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోగా యుద్ధం మరింత ముదురుతోంది.ఈ క్రమంలో ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ యుద్ధం ముగిసే పరిస్థితి లేక మరింత ముదిరితే.. ఐరోపాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువరించాయి. బల్గేరియా, సైప్రస్ సహా ఆగ్నేయ ఐరోపాలో ఉన్న పలు అమెరికా ఆస్తులపై దాడులకు దిగే అవకాశాలను టెహ్రాన్ బలగాలు అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్ పై అమెరికా భారీ దాడులకు దిగితే.. పశ్చిమాసియాను దాటి ఆ దేశ సైనిక ఆస్తులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఇరాన్ (Iran) కమాండర్లు ఈ మేరకు హెచ్చరించారు. బల్గేరియా యూఎస్ ఇంధన విమానాల కోసం తమ ‘బెజ్మెర్’ వైమానిక స్థావరాన్నివినియోగించుకునేందుకు ఇటీవలే అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో బల్గేరియాలోని అమెరికా ఆస్తులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం పరిశీలనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అదే క్రమంలో సైప్రస్‌ను కూడా ఇరాన్ టార్గెట్‌గా పరిగణించినట్లు సమాచారం. అదేవిధంగా.. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఆయా దేశాల సముద్రగర్భ కేబుళ్లపై దాడి చేసే అవకాశాన్ని కూడా ఇరాన్ దళాలు పరిశీలించాయని మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఇదిలా ఉండగా.. ఒకవైపు యుద్ధం సాగుతున్నప్పటికీ ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ఇరాన్‌కు రూ.70 వేల కోట్లకుపైగా చమురు సంబంధిత విదేశీ మారకద్రవ్యం సమకూరినట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది 1.5 రెట్లు అధికమని ఇరాన్ చమురుశాఖ సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియ కథనాలు వెలువరించాయి. మరోవైపు.. అమెరికా సైన్యానికి సాయం చేయడమంటే.. ఆ దేశ సైనిక చర్యలో పాలుపంచుకోవడంతో సమానమని గల్ఫ్ దేశాలను ఇరాన్ తాజాగా హెచ్చరించింది. అంటే ఆయా దేశాలపై దాడులు తప్పవని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది.









