Telangana government : తెలంగాణలో సినిమా టికెట్‌ ధరల పెంపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల సమయంలో టికెట్‌ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు సంక్షేమ విరాళంగా అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం తేల్చి చెప్పింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..టికెట్‌ ధరల పెంపు వల్ల వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాల్సి ఉంటుంది. అలా వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (TGFDC) నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కాగా ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ఇటీవల విడుదలయి ఘన విజయం సాధించిన ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్‌’, ‘మన శంకర వర ప్రసాద్‌ గారు ’, ‘పెద్ది’ తదితర చిత్రాలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.ఈ నాలుగు చిత్రాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొత్తాన్ని ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారం కూడా వారికే కల్పించారు.

ఈ మేరకు ఆయా చిత్రాలను నిర్మించిన 14 రీల్స్‌ ప్లస్‌ ఎల్‌ఎల్‌పీ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, షైన్‌ స్క్రీన్స్‌ ఇండియా, వృద్ధి సినిమాస్‌ తదితర సంస్థలకు ప్రభుత్వం అధికార లేఖలు పంపింది. సంబంధిత చిత్రాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి, టీజీఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం అకౌంట్‌లో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాతలకు ఈ సందర్బంగా సూచించింది. కాగా, ఈ చిత్రాలతో పాటు త్వరలో రాబోతున్న పలు భారీ చిత్రాలకు కూడా ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.