
Satyendar Jain : ఢిల్లీ ఏసీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీ జల్ బోర్డుకు చెందిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల టెండర్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో సత్యేంద్ర జైన్‌తో పాటు ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈఓ, ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాష్ రాయ్, గతంలో కాంట్రాక్ట్ సలహాదారుగా పనిచేసిన అంకిత్ శ్రీవాస్తవ, ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ కంపెనీ యజమాని రాజా కుమార్ కుర్రా, శ్రీజన్‌హర్ సంస్థ అధినేత పంకజ్ వర్మలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ జల్ బోర్డులోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరును పెంచడానికి, ఆధునీకరించడానికి చేపట్టిన టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన ,కుట్ర జరిగాయంటూ 2024 మే 11న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి.
సత్యేంద్ర జైన్ అరెస్టు వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు అని మండిపడింది. గతంలో మనీ లాండరింగ్ కేసులో నెలల తరబడి జైలులో ఉండి 2024లో బెయిలుపై బయటకు వచ్చిన జైన్‌ను, బీజేపీ మళ్లీ కుట్రపూరితంగా తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేయించిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పాత కేసు లాగే ఇది కూడా తప్పుడు కేసని, ప్రతిపక్షాలను భయపెట్టడానికే బీజేపీ ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించారు.
కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, బీజేపీ అక్రమాలు మితిమీరిపోయాయని, ఈ నియంతృత్వ ధోరణి వల్ల కేంద్ర ప్రభుత్వానికి ముగింపు సమయం దగ్గరపడిందని అన్నారు. ఏ తప్పూ చేయని తమ నాయకులు జైలు శిక్ష అనుభవించి, పడిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పార్టీతో పాటు దేశ ప్రజలందరూ సత్యేంద్ర జైన్‌కు అండగా ఉన్నారని చెప్పారు.









