dimagi

Dimagi Naxal Party : ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్టుండి వెలిసిన ఒక అకౌంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో దర్శనమిచ్చిన ఈ అకౌంట్, తెరుచుకున్న ఒక్కరోజులోనే ఏకంగా 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఎంత వేగంగా ఇది వెలుగులోకి వచ్చిందో, అంతకంటే వేగంగానే అకస్మాత్తుగా మాయమైపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఆగస్టు నెలలోనే ప్రారంభమైన ఈ ఖాతాలో మొత్తం 62 పోస్టులు ఉండగా, కేవలం 35 ఇతర అకౌంట్లను మాత్రమే ఇది ఫాలో అయ్యింది. అలాగే దీని యూజర్ నేమ్‌ను కూడా ఒకసారి మార్చినట్లు సమాచారం. అయితే, అసలు ఈ పేజీని ఎవరు సృష్టించారు, దీని వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడటంతో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేశామని, కానీ ఈ దిమాగీ నక్సల్స్ ప్రమాదం మాత్రం ఇంకా పొంచి ఉందంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

Also Read : NTA మరో నిర్లక్ష్యం: UGC-NETలో తప్పులు, సెప్టెంబరులో రీ-ఎగ్జామ్స్!

కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందిస్తూ నేను దిమాగీ నక్సల్‌గా ఉండటానికి గర్వపడుతున్నాను అని ట్వీట్ చేయగా, ప్రధాని ఆ వ్యాఖ్యలు ప్రతిపక్షాలను ఉద్దేశించి చేయలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ఈ రాజకీయ వేడి నడుమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విచిత్ర అకౌంట్ రావడం, వెంటనే డిలీట్ కావడం గమనార్హం.

Also Read : అస్సాం సీఎంకు బెదిరింపులు.. నిందితుడి అరెస్టు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.