Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గిరిజన జాతర ప్రాంతమైన మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతల సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, మేడారం చేరుకున్న రేవంత్‌ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు. ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన సాంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో స్థానిక కళాకారులు సీఎంకు స్వాగతం పలుకుతూ జాతర ప్రాంగణం వరకు తీసుకెళ్లారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా గద్దెల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు.

రేవంత్‌ రెడ్డి వనదేవతలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వన దేవతల సమక్షంలో సీఎం, మంత్రులకు సీతక్క రాఖీలు కట్టారు. అనంతరం సీఎం మేడారం గద్దెల అభివృద్ధి పనులను పరిశీలించారు. అమ్మవార్ల దర్శనానంతరం అక్కడికి వచ్చిన మహిళలతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. ఉచిత బస్సు సహా.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ములుగు గట్టమ్మ ఆలయం వద్ద హ్యామ్ రోడ్ల పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు. తొలిదశలో 3 వేల గ్రామాల్లో హ్యామ్ రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించారు. మొత్తంగా నేడు ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.