
TG SAFE : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల విలీనానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటినుంచి ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఏకీకృత పరిపాలన కింద పనిచేస్తాయి. ఈ రెండింటినీ విలీనం చేయడంతో పాటు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను (TG SAFE) రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇందులో భాగంగా ఆహారం, మందులు, కాస్మెటిక్స్‌పై లైసెన్సింగ్, తనిఖీలు, శాంప్లింగ్, పరీక్షలు, ఎన్ఫోర్స్మెంట్ను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేసింది.
TG SAFE ఆధ్వర్యంలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్ఫోర్స్మెంట్, లీగల్ & ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేస్తాయి. వీటితో పాటు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఒకే ల్యాబొరేటరీ విభాగం కిందకు ప్రభుత్వం తీసుకురానుంది. ఇకనుంచి అక్రమాలు, కల్తీపై నిఘా పెంచేందుకు ఇంటెలిజెన్స్, రిస్క్ ఆధారిత తనిఖీలను టీజీ సేఫ్ చేపడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం డీజీపీ టీజీ సేఫ్ కు పోలీసు సిబ్బందిని కేటాయించనున్నారు. మొదటి దశలో క్యూర్ ప్రాంతంలో టీజీ సేఫ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
క్యూర్ ప్రాంతంలో ఆహార వ్యాపారాలు, డ్రగ్స్ సంస్థలు అధికంగా ఉన్న కారణంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఫుడ్, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తారు. టెస్టింగ్, ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, లీగల్ సపోర్ట్, ల్యాబ్ మౌలిక వసతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. TG SAFE ఏర్పాటు ద్వారా ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వనుందని తెలుస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కాగా దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది.
టీజీ సేఫ్ కమిషనర్‌గా అవినాశ్ మొహంతి
కాగా, టీజీ సేఫ్ కు కమిషనర్‌గా అవినాశ్ మొహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. ఈ మేరకు అవినాశ్ మొహంతికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాశ్ మొహంతి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల సమన్వయానికి టీజీ సేఫ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రెండు విభాగాలను యూనిఫైడ్ అడ్మినిస్ట్రేషన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్‌పై పరిపాలనా నియంత్రణ అంతా కూడా టీజీ సేఫ్ కమిషనర్‌కు అప్పగించడంతో పాటు అవినాశ్ మొహంతిని TG SAFE కమిషనర్‌గా నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం.









