
Harish Rao :సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన విమర్శలపై.. ఆ పార్టీ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు 420 హామీలిచ్చిన రేవంత్.. నేడు సంగారెడ్డి సభలో 420 మాటలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలాంటి మాటలు మాట్లాడేందుకు చాలా ఇబ్బంది అనిపించినా.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించక తప్పడం లేదని హరీశ్‌రావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16వేల ఉద్యోగాలిచ్చిందని అసెంబ్లీలో చెప్పిన రేవంత్.. నేడు సంగారెడ్డి సభలో ఏకంగా 70 వేల ఉద్యోగాలిచ్చామని డబ్బాలు కొట్టాడన్నారు, ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించడం లేదా అని హరీశ్‌రావు ఘాటుగా ప్రశ్నించారు.ఉద్యోగాలపై అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డికి నిరుద్యోగులే బుద్ధి చెప్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేశారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి.. దానిని జాబ్ లెస్ క్యాలెండర్ గా చేసినందుకు తప్పైందని నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే గన్ మెన్లు లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీల వద్దకు రావాలని అక్కడ ఎన్ని జాబులిచ్చావో నిరుద్యోగులే చెప్తారని ఛాలెంజ్ విసిరారు.
సంగారెడ్డిలో సభ పెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సంగారెడ్డికి ఏం చేశారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. జిల్లాలో కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డైనా వేశారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ సంగారెడ్డిలో ప్రాజెక్టులపై ఒక మాట మాట్లాడలేదని, అంతా సొల్లు చెప్పారని తీవ్రంగా మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనుల ఊసే ఎత్తలేదన్నారు. రేషన్ కార్డుల విషయానికొస్తే.. బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు, ఇప్పుడేమో అసలు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదని అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి మాట్లాడుతున్న సీఎం.. గడిచిన రెండేళ్ల బకాయిలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్లు, తుపాన్ల బకాయిలను కూడా చెల్లించామని గుర్తు చేశారు, గడిచిన రెండున్నరేళ్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఎగ్గొట్టి విద్యార్థులను మోసం చేయాలని రేవంత్ చూస్తున్నారని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. విద్యార్థుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసే కుట్ర చేయొద్దని హితవు పలికారు. రైతు బంధు కూడా కేసీఆర్ ఇచ్చినదానికంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువే ఇచ్చిందన్నారు, తప్పయితే తాను ముక్కు నేలకు రాస్తానని, లేదంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాస్తారా అని ఆయన చాలెంజ్ చేశారు. 2020 నుంచి ఏటా 14 వేల కోట్లకు తగ్గకుండా రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండు ఆర్థిక సంవత్సరాలు కలిపి రూ.15 వేల కోట్లే రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో 2020-21 లో రూ.14,656 కోట్లు, 2021-22 రూ.14,772 కోట్లు, 2022-23లో రూ.14,743 కోట్ల చొప్పున రైతుబంధు ఇచ్చిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2024-25లో రూ.5057 కోట్లు, 2025-26 లో రూ.11,000 కోట్ల రైతుబంధు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. దీనిని బట్టి చూస్తే రూ.2000 పెంచి రైతుబంధు ఇచ్చినట్లా? లేక ఉన్నది కూడా ఎగ్గొట్టినట్లా? రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.









