
Deputy CM Bhatti : తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బిగ్ షాక్ తగలనుంది. ఆయన భార్య నందిని పై ఇటీవల వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ గవర్నర్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది. భట్టి విక్రిమార్క సతీమణి నందిని భట్టిపై ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. పెన్షన్ బకాయిల విడుదలకు నందిని కమీషన్ డిమాండ్ చేశారంటూ వారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అంబర్‌పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన కరుపోతుల రేవంత్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దీనిపై జోక్యం చేసుకోవాలంటూ ఆయన ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా, ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన గవర్నర్‌ను విజ్ఞప్తి చేయడం గమనార్హం.

కాగా ఆగస్టు 9, 2026న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగిని, INTUC అనుబంధ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అయిన S.K. ప్రసన్నకుమారి మీడియా ముందు పలు ఆరోపణలు చేశారు. తనకు రావాల్సిన రూ. 40 లక్షల పదవీ విరమణ బకాయిలను క్లియర్ చేయడం కోసం 10 శాతం కమీషన్, అంటే రూ. 4 లక్షలు ఇవ్వాలని నందిని డిమాండ్ చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే సుమారు రూ. 120 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత ఫైళ్లు ముందుకు కదలాలన్నా లేదా బిల్లులు మంజూరు కావాలన్నా 6 శాతం నుండి 10 శాతం వరకు కమీషన్లు అడుగుతున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల కక్కుర్తి కనిపిస్తుందని, తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఆ మహిళ నాయకురాలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అలాగే సదరు వార్త పలు ప్రధాన తెలుగు పత్రికలలో, ఛానళ్లలో వార్తలు వచ్చాయని లాయర్ కరుపోతుల రేవంత్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.









