KCR : ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పెద్దన్నగా నిలిచారు. పెద్ది కుటుంబ సంక్షేమాన్ని భుజాన వేసుకుంటూ పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో పాటు పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున మొత్తం రూ. 2 కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నారు. వృద్ధాప్యంలో ఉన్న సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ. 25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు. కేవలం ఆర్థిక సహాయంతోనే ఆగకుండా, పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమ బాధ్యతలను పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read : చేయూత కొత్త పింఛన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ పూర్తయిన తర్వాత వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పెద్ది కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా పెద్దదిక్కుగా అండగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కాగా ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. 2026 జులై 26న హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది.

వెంటనే ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు గంటపాటు శ్రమించి 9 సార్లు సీపీఆర్ నిర్వహించి గుండె స్పందించేలా చేశారు.అయితే కొంతసేపు మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ, 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి 2026 జులై 31న తుదిశ్వాస విడిచారు.

ఇక తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు వివాహం చేసుకోనని ఆయన చేసిన శపథం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తిరుమల కొండపై స్వప్నను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.

Also Read : మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్‌… మొదటి దశకు పర్యావరణ అనుమతులు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.