
Cheyutha Pensions : తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరు చేసేందుకుగాను నేటి (శనివారం) నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ర్టంలోని ఒంటరి మహిళలు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు చేయూత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు వీరితో పాటు థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రమే చేయూత వెబ్‌సైట్ నుంచి ఫారం డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత అధికారులకు అందజేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ అంటూ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : KCR సంచలన నిర్ణయం.. పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం!
దీనికి సంబంధించిన వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లను అందించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. అర్హుల నుంచి దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తామని, ఇందుకు ఎలాంటి చివరి తేదీ అంటూ లేదని అందులో స్పష్టం చేశారు. కొత్త పింఛన్ల మంజూరులో కొన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించింది. ఇందులో మొదటి ప్రాధాన్యంగా ఒంటరి మహిళలు, వితంతువులను ఎంచుకుంది. అలాగే గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దివ్యాంగుల కేటగిరీలో థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులను కూడా అర్హులుగా పరిగణించారు. వీరికి కూడా పింఛన్లు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చేయూత పింఛన్లకు అర్హత విషయంలో కుటుంబ వార్షికాదాయంతో పాటు, వ్యవసాయ భూమి విషయంలోనూ పరిమితులను విధించింది. మూడెకరాల కంటే ఎక్కువ మాగాణి భూమి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉన్నవారు పింఛన్‌కు అర్హులు కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నవారు కూడా అనర్హులుగా పేర్కొన్నారు. డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులు కూడా ఈ పింఛన్లకు అనర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
వీరే కాక ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్‌ల యజమానులు, వారి తల్లిదండ్రులకు కూడా చేయూతకు అనర్హులుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్నవారికి కొత్తగా చేయూత పింఛన్ మంజూరు చేయమని కూడా వివరించింది. నాలుగు చక్రాల వాహనాలు, భారీ వాహనాలు కలిగి ఉన్నవారినీ అనర్హులుగా పరిగణించింది. . గతంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే తమ దరఖాస్తులు ప్రస్తుతం రికార్డుల్లో ఉన్నాయో లేదో సంబంధిత అధికారుల ద్వారా ధ్రువీకరించుకోవాలని కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు ఈ వివరాలను ధ్రువీకరిస్తారని తెలిపింది.
Also Read : గిగ్ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె వాయిదా
దరఖాస్తు విధానం ఇదే..
చేయూత కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేయూత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫారంలో అవసరమైన వివరాలను పూర్తిగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలి.గ్రామాల్లో దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులకు, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో అందజేయడానికి అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, పురపాలక కమిషనర్లకు దరఖాస్తులను ఇవ్వాలి. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించకపోవడంతో అర్హులైన వారు తమ దరఖాస్తులను నిరంతర ప్రక్రియలో భాగంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రాధాన్య వర్గాలను గుర్తించి అర్హత నిబంధనల ప్రకారం కొత్త పింఛన్లను మంజూరు చేస్తారని అధికారులు వెల్లడించారు.









