Musi Riverfront Project : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీనది తీర అభివృద్ధి ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌ అవుతోంది. మూసీ ప్రాజెక్టు మొదటి దశకు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) ఈ నెల 5న ముందస్తు ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్‌ మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయడానికి పావులు కదుపుతుంది. అందులో భాగంగా దసరా లోపు టెండర్లను ఆహ్వానించి మూసీనది మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో మూసీ సుందరీకరణ పనులను ప్రారంభించనుంది. అయితే ప్రాజెక్టు మొదలు పెట్టిన నాటి నుంచి దాదాపు రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని, అంటే 2027 డిసెంబరు లేదా 2028 ఏడాది ప్రారంభం నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంఆర్‌డీసీఎల్‌కు గడువు విధించింది.

రేవంత్‌ సర్కార్‌ అంత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీసుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 55 కిలోమీటర్ల మేర విస్తిరించి ఉన్న మూసీనది మొత్తం అభివృద్ధి పనులను 2030 నాటికి పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంది. మురికికూపంగా మారి హైదరాబాద్‌ మహా నగరంలో ప్రవహిస్తున్న మూసీనదిని పునరుజ్జీవం చేయడానికి ఐదు జోన్లుగా విభజించిన విషయం తెలిసిందే. తద్వారా ఒక్కో జోన్‌ను పునరుజ్జీవం చేస్తూ 2030 నాటికి పూర్తి నదిని పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. 1వ జోన్‌ పరిధిలో ఉన్న 21 కిలోమీటర్ల మూసీనది ప్రాంతాన్ని ఫేజ్‌-1 కింద అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ మూసీ అభివృద్ధిలో భాగంగా పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఫేజ్‌-1 అభివృద్ధికి రూ.7,055 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే ఫేజ్‌-1ఏకు రూ.3105 కోట్లు, ఫేజ్‌-1బీకి 3,950 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించనున్నారు.

Also Read : స్కూళ్లలో ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాలి.. సీఎం రేవంత్ సంచలనం!

కాగా మూసీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీకి ఎంఆర్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికను అందజేశారు. అందులో ప్రధానంగా మూసీనదిలో వరద నివారణ చర్యల అభివృద్ధిని ఎలా చేపడుతారు, నదీతీర ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా అభివృద్ది చేయనున్న ల్యాండ్‌ స్కేప్‌లు, పచ్చదనాన్ని గురించి వివరించారు. వీటితోపాటు వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ 30 మీటర్ల రహదారులు, సర్వీసు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నదిలో చెక్‌ డ్యామ్‌లు, కల్చరల్‌ ప్లేస్‌లు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక మూసీలోని మురుగునీటి పంపింగ్‌ స్టేషన్లు, మురుగు నియంత్రణ వ్యవస్థలను మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ)కు అనుసంధానం చేయాలని సంకల్పించారు.

వీటితో పాటు పర్యావరణాన్ని పునరుద్ధరించడంలో భాగంగా నదీతీర ఆవాసాలను పునరుద్ధరించడం, స్థానికంగా మొక్కల పెంపకం, చిత్తడి నేలలను అభివృద్ధి చేయడం, గ్రీన్‌ కారిడార్లు, జీవవైవిధ్య పెంపుదల, వాతావరణ మార్పులను తట్టుకోగలిగే ల్యాండ్‌స్కే్‌ప్‌లను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా నది సహజ పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా వర్షాకాలంలో 30 శాతం సగటు ప్రవాహం ఉంటుందని, మిగతా నాలుగు నెలల్లో కనీసం 20 శాతం సగటు ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంఆర్‌డీసీఎల్‌ సమర్పించిన నివేదికలో పేర్కొంది. అంతేకాక నది సహజ స్వరూపం మార్చకుండా అభివృద్ధి చేస్తామని అందులో వివరించారు. నిర్మాణ దశలో రోజుకు 1050 కిలోలు, నిర్వహణ దశలో రోజుకు 2,783 కిలోల ఘన వ్యర్థాలు ఉ్పత్పత్తి అవుతాయని తన నివేదికలో పొందుపరిచారు.

ఫేజ్‌-1లో భాగంగా అభివృద్ధి చేసే మూసీనది తీర ప్రాంతం మొత్తం 495 ఎకరాలుగా నిర్ణయించారు. ఇందులో 158 ఎకరాలను రోడ్ల అభివృద్ధికోసం కేటాయించారు. 138 ఎకరాలను పచ్చని ప్రదేశాలను అభివృద్ధి చేయడం కోసం, 128 ఎకరాలను నది పరిరక్షణ తీసుకునే చర్యల కోసం, ప్రహరీ నిర్మాణం కోసం వినియోగిస్తారు. 54 ఎకరాల వరకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగిస్తారు. ఇందులో నిర్మాణాలు ఐదు ఎకరాలకు మించకూడదని నిర్ణయించారు. దాదాపు 32 వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్‌ కోసం కేటాయించారు.

కాగా, మూసీ అభివృద్ది కోసం అంచాన వేసిన 495 ఎకరాలలో 158 ఎకరాలు ప్రభుత్వ భూమి , 146 ఎకరాలు పట్టా భూమి, 30 ఎకరాలు వరకు రక్షణ శాఖ భూములు, 126 ఎకరాలు నదీ తీర ప్రాంతం ఉన్నట్లు ఎంఆర్‌డీసీఎల్‌ తన నివేదికలో వెల్లడించింది. కాగా, మూసీ మొదటి దశలో అభివృద్ధి చేసే ప్రాంతంలో సుమారు 639 వరకు శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 2,660 చెట్లను తొలిగించాల్సి వస్తుందని కూడా వివరించారు. అయితే ఆ చెట్లను వీలైనంత వరకు ట్రాన్స్‌లొకేషన్‌ చేస్తామని, ఒకవేళ చెట్టు నరికితే 1ః10 నిష్పత్తిలో కొత్త మొక్కలు నాటుతామని ఎంఆర్‌డీసీఎల్‌ పర్యావరణ శాఖకు వివరించింది.

Also Read : నిరుద్యోగులకు HYDRAA శుభవార్త.. టెన్త్ అర్హతతో ఎగ్జామ్ లేకుండా జాబ్స్.. రేపు, ఎల్లుండే ఛాన్స్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.