
Honey-Trap : జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న అనుమానిత ఉగ్రవాది హమిమ్ మొండల్ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కీలక అరెస్ట్ చేసింది. హమిమ్ మొండల్ మహిళా సహచరురాలైన అర్పిత సర్కార్‌ను జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ ప్రాంతంలో శుక్రవారం అరెస్ట్ చేసి, బెంగాల్‌లోని బర్ధమాన్‌కు తీసుకువచ్చారు.
గురువారం బర్ధమాన్ పట్టణంలో అనుమానిత జైషే మహమ్మద్ ఆపరేటివ్ మహమ్మద్ హమిమ్ మొండల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అర్పిత సర్కార్ అతనికి అత్యంత సన్నిహితురాలని, ప్రియురాలని పోలీసులు తెలిపారు. వాట్సాప్ ద్వారా వీరిద్దరూ నిత్యం టచ్‌లో ఉన్నారని, విచారణలో భాగంగా వీరి మధ్య జరిగిన చాటింగ్ వివరాలను పోలీసులు సేకరించారు.
Also Read : మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు.. ట్విస్ట్ ఏంటంటే?
బర్ధమాన్‌లోని ఒక హౌసింగ్ కాంప్లెక్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న మొండల్‌ను ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. ఇతను పాకిస్థాన్ నిఘా సంస్థ ISI మద్దతుతో నడుస్తున్న నెట్‌వర్క్‌లో భాగమని, బీజేపీ నేతలతో సహా ప్రముఖ వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం, కొత్తవారిని రిక్రూట్ చేయడం, రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు పునాది వేయడం వంటి పనులకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకోవడానికి, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి మొండల్ ఈ యువతిని ఉపయోగించుకున్నాడని అధికారులు తెలిపారు. ఈ అనుమానిత మాడ్యూల్ కార్యకలాపాలలో భాగంగా టార్గెట్లను ఆకర్షించడానికి అర్పిత ‘హనీ-ట్రాప్’ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించిందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. కొందరు రాజకీయ ప్రముఖుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టేందుకు ఈ నిందితురాలు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
ఈ సమాచారాన్ని ఉపయోగించి దాడులకు ఏమైనా ప్లాన్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. కాగా, మొండల్ అరెస్ట్‌పై శుక్రవారం స్పందించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఇది చాలా సున్నితమైన అంశమని, ఎస్టీఎఫ్, సీనియర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, దీనికి అంతర్జాతీయ సంబంధాలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. మొండల్ సువేందు అధికారి కదలికలను, ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాలను నిరంతరం గమనిస్తున్నట్లు వెల్లడైంది.
Also Read : అత్తమామలు వరకట్న వేధింపులు.. టీచర్ సూసైడ్.. VIDEO VIRAL









