
Madurai Meenakshi Temple : మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి చెందిన దాదాపు ₹80 కోట్ల విలువైన విలువైన భూములను నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ భూ అక్రమాలపై హిందూ మత, ధార్మిక దాయాదుల (HR&CE) శాఖ జాయింట్ కమిషనర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. చెల్లదురై ఫిర్యాదు చేయడంతో మదురై మెట్రోపాలిటన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన అధికారులతో సహా 19 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వివాదాస్పద భూమి హిస్టరీ పరిశీలిస్తే.. 1930లో పుదుక్కోట్టై రాజకుమారర్ దక్షిణామూర్తి దురైరాజ దురైరాణి ఒక ట్రస్టును స్థాపించారు. మదురైలోని అలగర్‌కోయిల్ రోడ్డులో ఉన్న అశోక విలాస్ బంగ్లా ,దానికి ఆనుకుని ఉన్న తోట ఈ ట్రస్ట్ పరిధిలోకి వస్తాయి. ట్రస్ట్ వీలునామా నిబంధనల ప్రకారం, ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మదురై మీనాక్షి అమ్మన్ ఆలయానికి, అలగర్‌కోయిల్ కల్లాలగర్ ఆలయానికి నిత్య కైంకర్యాలు, పెరుగు అన్నం నైవేద్యం, సుండల్ పంపిణీ ,నవరాత్రి పూజల కోసం వినియోగించాలి. ఈ ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి మాత్రమే అనుమతి ఉంది తప్ప, అమ్మడానికి లేదా తాకట్టు పెట్టడానికి ఎటువంటి హక్కు లేదు.
ఈ నేపథ్యంలో, మదురై నార్త్ తహసీల్దార్ ఆలయానికి ఉన్న హక్కులను ఏకపక్షంగా తొలగించి, 2016 జూన్ 24న తొమ్మిది మంది ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద అక్రమంగా పట్టాలు జారీ చేశారు. ఈ మోసాన్ని గుర్తించిన ఆలయాధికారులు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)కు అప్పీల్ చేయగా, ఆర్‌డిఓ తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేసి, పట్టాను మళ్లీ ఆలయం పేరు మీద పునరుద్ధరించారు. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌ను ఆశ్రయించి మధ్యంతర స్టే పొందారు.
కోర్టు వివాదాలు నడుస్తున్న సమయంలోనే, ఈ ఆస్తులను ఇతరులకు బదిలీ చేయకుండా చూడాలని హెచ్‌ఆర్&సిఇ శాఖ స్థానిక చొక్కీకుళం, తిరుమయం సబ్-రిజిస్ట్రార్లకు స్పష్టమైన లేఖలు రాసింది. ఆలయ అధికారుల అప్రమత్తత వల్ల స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే, నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడి, మదురై పరిధి దాటి తిరునెల్వేలి జిల్లాలోని మురప్పనాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో 2021 ఏప్రిల్ 4న నకిలీ పత్రాలతో ఈ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు.
Also Read : E20 కాంట్రవర్సీపై నితిన్ గడ్కరీ షాకింగ్ రియాక్షన్.. మాట మార్చిన కేంద్ర మంత్రి..!
అవినీతి నిరోధక సంస్థ ‘అరప్పోర్ ఇయక్కం’ ఈ భూ కుంభకోణాన్ని హెచ్‌ఆర్&సిఇ శాఖ దృష్టికి తీసుకురావడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు హెచ్‌ఆర్&సిఇ శాఖ మంత్రి రమేష్ మాట్లాడుతూ, చొక్కీకుళం ప్రాంతంలోని 0.72 హెక్టార్ల (సుమారు 1.79 ఎకరాలు) ఆలయ భూమిని 2021లో మోసపూరితంగా రిజిస్టర్ చేశారని తెలిపారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం దీని మార్గదర్శక విలువ ₹20 కోట్ల నుండి ₹30 కోట్లుగా ఉన్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు ₹60 కోట్ల నుండి ₹80 కోట్ల వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ భూ అక్రమాలకు సహకరించిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బాధ్యుడైన గ్రామ పరిపాలనాధికారి (VAO)ని ఇప్పటికే సస్పెండ్ చేయగా, అక్రమ పట్టాలు జారీ చేసిన తహసీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. అంతేకాకుండా, ఈ మొత్తం వ్యవహారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ-కరప్షన్ (DVAC) విచారణకు కూడా నివేదించారు. రెవెన్యూ రికార్డులను పక్కదారి పట్టించిన అధికారులను వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం మదురై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మాజీ తహసీల్దార్లు, మాజీ వీఏఓలు, సబ్-రిజిస్ట్రార్లు , నకిలీ పట్టాలు పొందిన ప్రైవేట్ వ్యక్తులతో సహా మొత్తం 19 మంది పేర్లను చేర్చారు. నిందితులపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 120(బి) (నేరపూరిత కుట్ర) సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
చట్టబద్ధమైన పోరాటం ద్వారా ఆలయానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా వదలకుండా తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్‌ఆర్&సిఇ మంత్రి రమేష్ పునరుద్ఘాటించారు. దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రసిద్ధ మదురై మీనాక్షి అమ్మన్ ఆలయ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, విచారణలో భాగంగా భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు , కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులందరికీ శిక్ష పడేలా చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read : పరారీకి ప్రయత్నించిన గ్యాంగ్ రేప్ నిందితులు.. కస్టడీలోనే ప్రజల దాడి









