
Strait Of Hormuz : పశ్చిమాసియా ప్రాంతంలో క్షిపణి యుద్ధ వాతావరణం తాత్కాలికంగా శమించినప్పటికీ, వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో భద్రతా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. గత రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగిన సైనిక ఉద్రిక్తతలకు ఉభయ పక్షాలు విరామం ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, మలకా జలసంధి తరహాలోనే ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హర్మూజ్‌లో భయాందోళనలు మాత్రం సడలలేదు.
ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి పరిధిలో ఓ ప్రైవేట్ చమురు ట్యాంకర్ సముద్రపు ల్యాండ్‌మైన్ (సీమైన్)ను ఢీకొని తీవ్ర పేలుడుకు గురికావడం అంతర్జాతీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా నిర్దేశించిన సురక్షిత నౌకా మార్గాన్ని (Maritime Corridor) కాదని, ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ ధ్రువీకరించింది. ఈ విధ్వంసంలో నౌకా సిబ్బంది ప్రాణనష్టం లేదా చమురు లీకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న శక్తివంతమైన ‘ఖైబర్ షెకాన్’ బాలిస్టిక్ క్షిపణులు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలకు ముప్పుగా మారాయనే ఆందోళనల మధ్యే, ఇరుదేశాలు తాత్కాలికంగా సైనిక చర్యలను నిలిపివేశాయి. రాయబార చర్చలను పునఃప్రారంభించేందుకు ఇరాన్ సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ, అమెరికా ముందు మూడు కఠినమైన షరతులను ఉంచింది. ప్రత్యామ్నాయ నౌకా మార్గాల ఏర్పాటు ప్రతిపాదనలను నిష్కర్షగా తిరస్కరిస్తూ టెహ్రాన్ తన పట్టుదలను స్పష్టం చేసింది.
Also Read : ట్రంప్‌కు ఇరాన్ మైండ్ బ్లాక్ స్కెచ్.. ఆ 3 షరతులు ఒప్పుకుంటేనే చర్చలు!
ఇరాన్ విధించిన షరతుల్లో మొదటిది—హర్మూజ్ జలసంధిపై తమకు ఉన్న పూర్తి భౌగోళిక, వ్యూహాత్మక నియంత్రణను అమెరికా, దాని మిత్రదేశాలు అధికారికంగా గురింంచాలి. రెండోది—వివిధ అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అమెరికా, పాశ్చాత్య బ్యాంకుల్లో స్తంభింపజేసిన (Freeze) కోట్లాది డాలర్ల ఇరాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలి. ఈ రెండు ప్రాథమిక డిమాండ్లపై స్పష్టమైన పురోగతి సాధించిన తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమం (Nuclear Program) పరిమితులపై చర్చలు జరుపుతామని టెహ్రాన్ స్పష్టం చేసింది.
అదే సమయంలో, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, వాటి భద్రత ,నావిగేషన్ రుసుముల (Maritime Tolls) వసూలుపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు వేగవంతమయ్యాయి. తమ దేశాల సార్వభౌమాధికారానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా, అంతర్జాతీయ వ్యాపార నౌకల ప్రయాణానికి సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ఈ రెండు దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ తాత్కాలిక విరామంతో ఇంధన మార్కెట్లు తాత్కాలిక ఊపిరి పీల్చుకున్నప్పటికీ, హర్మూజ్‌లో సీమైన్ పేలుడు , ఇరాన్ పెట్టిన షరతులు గ్లోబల్ సప్లై చైన్‌ను మళ్లీ ప్రమాదంలో పడేశాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఆసియా, ఐరోపా దేశాల ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : స్పెయిన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో కార్చిచ్చు కలకలం….2లక్షల మందికి పైగా…









