ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు లేఆఫ్స్ విధిస్తున్నాయి. కానీ యూరప్‌కు చెందిన సెమీకండక్టర్ తయారీ దిగ్గజం ‘ASML’ తన సిబ్బందికి మంచి ఆఫర్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ యంత్రాల సంస్థ అయిన ASML తమ కంపెనీలో ముఖ్యమైన ఉద్యోగాలు మానేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ‘రిటెన్షన్ బోనస్’ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఉద్యోగికి 20,000 యూరోలు (సుమారు 22,838 డాలర్లు లేదా భారతీయ కరెన్సీలో రూ.22 లక్షలు) విలువైన షేర్లను అవార్డుగా అందించనున్నట్లు తెలిపింది.

Also Read : పుతిన్‌కు ఇంకా చావు లేదా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

ఈ రిటెన్షన్ ప్రణాళిక ప్రకారం 2027 జనవరి 1న అర్హత సాధించిన ఉద్యోగులకు 20,000 యూరోల విలువైన షేర్ గ్రాంట్లు ఇష్యూ చేస్తారు. అయితే ఈ షేర్లు పూర్తిగా ఉద్యోగుల సొంతం కావాలంటే వారు కనీసం 2030 జనవరి 1 వరకు అంటే వరుసగా 3 ఏళ్ల పాటు అదే కంపెనీలో కొనసాగాలి. టాలెంటెడ్ ఉద్యోగులను కంపెనీ నుంచి బయటకు పంపించకుండా ఉండేందుకు కంపెనీ ఈ రూల్‌ను తీసుకొచ్చింది.

Also Read : తాలిబన్లకు ఊహించని బిగ్ షాక్.. వారి కోటకే కన్నం వేసిన ఆ మాస్టర్ మైండ్ ఎవరు?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అడ్వాన్స్‌డ్ చిప్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగినప్పటికీ, సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో పోటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆకర్షించకుండా అడ్డుకోవడానికే ASML ఈ నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ దిగ్గజ సంస్థ ప్రపంచంలోనే అగ్రగామి చిప్ తయారీ సంస్థలైన TSMC, ఇంటెల్, శామ్‌సంగ్ వంటి వాటికి అవసరమైన అత్యాధునిక లిథోగ్రఫీ యంత్రాలను సరఫరా చేసే ఏకైక కంపెనీ కూడా ఇదే. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 44,500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ASML మాత్రమే కాకుండా ఇతర సెమీకండక్టర్ దిగ్గజాలు కూడా తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే హైనిక్స్ సంస్థలు తమ సిబ్బందికి భారీ పర్ఫార్మెన్స్ బోనస్‌లు ఇవ్వగా, టీఎస్‌ఎంసీ తన ఉద్యోగుల లాభాల వాటాను ఏకంగా 30 శాతానికి పెంచింది. ఐటీ రంగంలో నిరాశ నెలకొన్న సమయంలో సెమీకండక్టర్ విభాగంలోని ఉద్యోగులకు మాత్రం ఈ బోనస్‌ల వర్షం కురిపిస్తోంది.