
Taliban Disarmed: 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్న తాలిబన్లకు బిగ్ షాక్ తగిలింది. తాలిబన్లకు కనిపించకుండా రహస్యంగా పనిచేస్తున్న ఓ కొత్త సాయుధ ముఠా ఏకంగా ఒక జిల్లా కేంద్రాన్నే తమ ఆధీనంలోకి తీసుకుని కలకలం సృష్టించింది. 2021 ఆగస్టు తర్వాత తాలిబన్ల పాలనలో ఓ ప్రత్యర్థి వర్గం జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఇలా ఆక్రమించుకోవడం ఇదే మొదటిసారి. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని బదఖ్‌షాన్ ప్రావిన్స్‌లో ఉన్న ‘యఫ్తల్-ఎ-పయీన్’ అనే జిల్లా హెడ్ క్వార్టర్స్‌పై సాయుధ యోధులు హఠాత్తుగా దాడి చేశారు. అక్కడున్న తాలిబన్ భద్రతా సిబ్బందిని భయపెట్టి.. వారి దగ్గరున్న ఆయుధాలను లాక్కున్నారు. ఆ తర్వాత జిల్లా పరిపాలనా భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడ తమ సొంత సంస్థ జెండాను ఎగురవేశారు. ఈ దాడి ఘటన తెలిసిన వెంటనే తాలిబన్ సైన్యం రంగంలోకి దిగింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ జిల్లాను మళ్లీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నామని, దాడికి పాల్పడిన కొందరిని అరెస్టు చేశామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రాంతంలో తాలిబన్ల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read : సొంత దేశంపైనే ఇరాన్ బాంబులు.. అమెరికా భయంతో బ్లాక్ బస్టర్ ప్లాన్
ఈ ఆకస్మిక దాడితో ఒక్కసారిగా వెలుగులోకి ఓ కొత్త గ్రూప్ ‘సిపాహియాన్-ఎ-మిహాన్’ పేరు వచ్చింది. పర్షియన్ భాషలో దీనికి ‘మాతృభూమి సైనికులు’ అని అర్థం. ఈ దాడి జరిగే వరకు అసలు ఇలాంటి ఒక సంస్థ ఉందనే విషయమే ఎవరికీ తెలీదు. ఈ గ్రూప్ తమ గుర్తుగా సూర్యుడు, పర్వతాలు, కత్తి, నక్షత్రాలు ఉన్న ఒక ప్రత్యేకమైన జెండాను ఉపయోగిస్తోంది. ఈ కొత్త ముఠాకు ‘ఖయ్యూమ్ ఖాన్ మలాంగ్’ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయన గతంలో అమెరికా మద్దతు ఉన్న ఆఫ్ఘన్ ఆర్మీలో పనిచేశాడు. అమెరికాకు చెందిన ప్రముఖ కమాండోలతో కలిసి పలు సైనిక ఆపరేషన్లలో కూడా పాల్గొన్నాడు. 2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక.. వేరే తిరుగుబాటు గ్రూప్‌లో చేరి.. ఆ తర్వాత కొన్ని విభేదాల వల్ల బయటకొచ్చి సొంతంగా ఈ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే తాలిబన్ సైనిక అధిపతి ఈ ఘటనను పెద్దగా పట్టించుకోనట్లు మాట్లాడారు. కేవలం పబ్లిసిటీ కోసం ఇటువంటి చిన్న చిన్న ముఠాలు దొంగచాటుగా వచ్చి జెండాలు ఎగురవేస్తుంటాయని కొట్టిపారేశారు. తమ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి ఈ కొత్త గ్రూపుకు ఎంతమాత్రం లేదన్నారు. ఈ ఘటన జరిగిన బదఖ్‌షాన్ ప్రాంతం చైనా, పాకిస్తాన్, తజికిస్తాన్ సరిహద్దులకు చాలా దగ్గరగా ఉండే వ్యూహాత్మక ప్రాంతం. ప్రస్తుతానికి ఈ దాడి వల్ల తాలిబన్ ప్రభుత్వానికి పెద్ద ప్రమాదమేమీ లేనప్పటికీ.. వారి పాలన వల్ల మళ్లీ వివాదం చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : వరల్డ్‌ని ముంచేసిన పాక్ ఆర్మీ చీఫ్ డ్రామా.. అసిమ్ మునీర్ క్రూరమైన డార్క్ సీక్రెట్స్ అవుట్!









