
ఒకప్పుడు రష్యాతో పోరాడటానికి ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు, క్షిపణులు, ట్యాంకులను అమెరికా సహాయం చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలక్రిందులైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో పరీక్షించిన డ్రోన్ టెక్నాలజీని డిమాండ్ చేస్తోంది. ఇరాన్, చైనా, రష్యాల నుంచి ముప్పు పెరుగుతున్న వేళ తన వద్ద ఆయుధాలు క్షీణించడంతో అమెరికా తన రక్షణ వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. సొంతంగా తయారు చేసిన డ్రోన్ బోట్ల కోసం ప్రస్తుతం అమెరికా ఉక్రెయిన్ తలుపు తట్టే స్థాయికి చేరుకుంది.
Also Read : వరల్డ్‌ని ముంచేసిన పాక్ ఆర్మీ చీఫ్ డ్రామా.. అసిమ్ మునీర్ క్రూరమైన డార్క్ సీక్రెట్స్ అవుట్!
ఉక్రెయిన్ ఐటీ రంగం, ప్రత్యేక సైనిక విభాగాలు కలిసి ‘మాగురా’ అనే మానవరహిత ఉపరితల నౌకలను (USV) అభివృద్ధి చేశాయి. రష్యాతో జరిగిన యుద్ధంలో నల్ల సముద్రంలో ఆ దేశపు భారీ యుద్ధనౌకలను ముంచెత్తడంలో ఈ డ్రోన్ బోట్లు కీలక పాత్ర పోషించారు. ఈ ‘మాగురా’ బోట్లు దాదాపు 800 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి.. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. 200 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ బోట్లలో GPS, నైట్ విజన్, ఆటోపైలట్ వంటి అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. ఈ బోట్ల విజయాన్ని చూసి అమెరికాకు చెందిన ‘రీకాన్క్రాఫ్ట్’ అనే సంస్థ ఉక్రెయిన్ నుంచి లైసెన్స్ తీసుకుని వీటిని అమెరికాలోనే ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది.
మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో సాగుతున్న ఉద్రిక్తతల వల్ల అమెరికా సైనిక ఆయుధాగారాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఇరాన్ వైపు నుంచి వచ్చే చవకైన డ్రోన్లను కూల్చేందుకు అమెరికా తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. దీనికోసం ఇప్పటివరకు సుమారు 32 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ఖరీదైన క్షిపణులు, సాంప్రదాయ యుద్ధనౌకల కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించే చవకైన మానవరహిత వ్యవస్థలే భవిష్యత్తు యుద్ధాలకు కీలకమని పెంటగాన్ భావించింది.
ఒకప్పుడు ఆయుధాల కోసం అమెరికాపైనే ఆధారపడిన ఉక్రెయిన్, ఇప్పుడు యుద్ధంలో స్వయంగా పరీక్షించి విజయం సాధించిన తన సాంకేతికతను అమెరికాకే అందించే స్థాయికి ఎదిగింది. పెంటగాన్ సైతం ఉక్రెయిన్ డ్రోన్ టెక్నాలజీని స్వీకరించడం ప్రపంచ సైనిక చరిత్రలోనే ఒక పెద్ద ఊహించని మలుపు. అత్యంత ఖరీదైన ఆయుధాల కంటే చవకైన, ప్రభావవంతమైన డ్రోన్లే రాబోయే రోజుల్లో ప్రపంచ సైనిక బలాన్ని శాసిస్తాయి.
Also Read : నేపాల్‌లో భారీ భూకంపం!









