warnar

David Warner : ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మద్యం సేవించి కారు నడిపిన కేసులో కోర్టు ముందు తన తప్పును అంగీకరించాడు. ఏప్రిల్‌లో సిడ్నీలో పోలీసులు నిర్వహించిన ర్యాండమ్ బ్రెత్ టెస్ట్‌లో వార్నర్ చిక్కాడు. ఏప్రిల్ 5న సిడ్నీ తూర్పు ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వార్నర్‌కు బ్రెత్ టెస్ట్ చేయగా, అతడు విఫలమయ్యాడు. ఆ తర్వాత మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా, ఆయన రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది చట్టం అనుమతించే పరిమితికి రెండింతలకు పైగా ఉందని పోలీసులు తెలిపారు.

విచారణ సందర్భంగా వార్నర్ తరఫు న్యాయవాది బాబీ హిల్ మాట్లాడుతూ.. తమ క్లయింట్ చేసినది తప్పేనని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. కారు నడపకుండా ఉబెర్‌లో వెళ్లి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, వార్నర్ కూడా తన నిర్ణయం చాలా మూర్ఖమైనదేనని ఒప్పుకున్నట్లు తెలిపారు. వైన్ తాగడం నేరం కాదు. కానీ తాగిన తర్వాత కారు నడపాలనే నిర్ణయం తీసుకోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు అని న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు.

Also Read : అమ్మవారి రూపంలో త్రిష.. ఇద్దరిపై పోలీసులు కేసు!

ఈ కేసులో వార్నర్‌కు ఆగస్టు 18న శిక్ష ఖరారు చేయనున్నారు. ఆయనపై కనీసం ఆరు నెలల పాటు డ్రైవింగ్ నిషేధం విధించే అవకాశం ఉంది. అలాగే 2,200 ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా లేదా గరిష్ఠంగా తొమ్మిది నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.

ఇది వార్నర్‌కు తొలి వివాదం కాదు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన బాల్ టాంపరింగ్ వ్యవహారంలో ఆయనపై 12 నెలల నిషేధం విధించారు. ఆ ఘటన తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా లేదా ఇతర నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కోల్పోయాడు.

అంతకుముందు 2013లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌పై దాడి చేసిన ఘటనలో కూడా వార్నర్ సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు డ్రింక్-డ్రైవింగ్ కేసుతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.

Also Read : తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్… మరో ఐదు రోజులు భారీ వర్షాలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.