సూరత్‌లో AI గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు ఒక సంచలన సైబర్ నేరాల ముఠాను పట్టుకున్నారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి కేవలం 18 ఏళ్ల కుర్రాడే కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. పదకొండో తరగతి చదువు మధ్యలోనే ఆపేసిన ఈ బాలుడు, ఏఐ టూల్స్, టెలిగ్రామ్ యాప్ సాయంతో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేరుతో అసలైన వాటిలాగే ఉండే నకిలీ యాప్‌లను తయారు చేశాడు. ఇలాంటి మోసపూరిత యాప్‌లతో దేశవ్యాప్తంగా అమాయకుల అకౌంట్ల నుంచి ఏకంగా రూ. 64 కోట్లకు పైగా కొల్లగొట్టారు.

ఈ కేసులో సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోదాలు చేసి, నిందితుడు రోహిత్ వీరేంద్రసింహ్ షాక్యను అరెస్ట్ చేశారు. ఇతను తయారు చేసిన ఈ ప్రమాదకర యాప్‌లను జార్ఖండ్‌లోని జమ్తారా, హర్యానా, రాజస్థాన్‌లలోని సైబర్ కేడీల ముఠాలకు సప్లై చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. పదహారేళ్ల ప్రాయంలోనే కోడింగ్ బాగా నేర్చుకున్న ఈ కుర్రాడు.. సైబర్ నేరగాళ్లకు నెలవారీ అద్దె పద్ధతిలో ఈ యాప్‌లను అమ్మాడు. ఒక్కో నెలకు రూ. 15,000 తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఆ యాప్‌లకు అప్‌డేట్లు ఇస్తూ సాయం చేసేవాడు.

ఈ కేడీలు ప్రధానంగా రెండు రకాల యాప్‌లను డిజైన్ చేశారు. ఒకటి బాధితులు తమ ఫోన్లలో ఎక్కించుకునే ‘విక్టిమ్ యాప్’, రెండోది నేరగాళ్లు వాడే అడ్మిన్ యాప్. ఎవరైనా అమాయకులు ఈ నకిలీ యాప్‌లను తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు, వారి ఫోన్ పూర్తిగా హ్యాకర్ల చేతులోకి వెళ్ళిపోతుంది. దీని ద్వారా నేరగాళ్లు బాధితుల ఫోన్‌కు వచ్చే ఓటీపీలు, బ్యాంకు పాస్‌వర్డ్‌లను లైవ్‌లో చూసి అకౌంట్లు ఖాళీ చేసేవారు. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యాక్సిస్, ఐసీఐసీఐ, యూకో, యూనియన్ బ్యాంకులతో పాటు బిగ్‌బాస్కెట్, అమెరికన్ ఎక్స్ఛేంజ్, పీఎం కిసాన్, ఆర్టీవో చలాన్ చెల్లింపుల పోర్టళ్ల పేరుతో వీరు ఈ నకిలీ యాప్‌లను పుట్టించారు.

ఈ భారీ మోసం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. మే నెలలో సూరత్‌కు చెందిన ఒక వ్యక్తి తన డబ్బులు పోయాయని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మే 15 నుంచి 18 మధ్య ఆ వ్యక్తి వాట్సాప్‌కు ‘PNB One.apk’ అనే ఫైల్ వచ్చింది. అది అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాప్ అనుకుని అతను తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. అంతే, క్షణాల వ్యవధిలో అతని అకౌంట్‌లో ఉన్న రూ. 5 లక్షలు వేరే ఖాతాకి బదిలీ అయిపోయాయి. వెంటనే బాధితుడు 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చెప్పడంతో, సూరత్ సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు స్పీడ్ పెంచారు.

పోలీసులు ఈ కేసులో లోతుగా డిజిటల్ తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ నిందితుడు ఏకంగా 121 రకాల మాల్‌వేర్ యాప్‌లను తయారు చేసినట్లు తేలింది. దేశవ్యాప్తంగా 21,672 ఫోన్లలో ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ కాగా, అందులో 2,928 ఫోన్లు పూర్తిగా హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోయాయి. ఈ యాప్‌ల సాయంతో ఏకంగా 54,094 సార్లు ఫ్రాడ్ లావాదేవీలు జరిగి, రూ. 64.38 కోట్లు మాయమైనట్లు గుర్తించారు. ముఖ్యంగా నకిలీ ఆర్టీవో చలాన్ యాప్‌ల ద్వారానే ఎక్కువ మోసాలు జరిగినట్లు తేలింది.

నిందితుడి దగ్గర నుంచి రెండు మొబైల్స్, ఒక లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఫ్రాడ్ నెట్‌వర్క్‌తో దేశంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి అనే కోణంలో గట్టిగా విచారణ జరుపుతున్నారు. సైబర్ మోసాల గుట్టురట్టు: 18 ఏళ్ల కుర్రాడే మాస్టర్ మైండ్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.