IPS UDAY SUICIDE NOTE : హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆయన ఎర్రగడ్డలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ తాజాగా బయటపడింది. తన ఆత్మహత్యాయత్నానికి నలుగురు వ్యక్తులు కారణమని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించిన ఉదయ్, తనపై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం కల్పితాలని, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకముందని పేర్కొంటూ తన నిర్దోషిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు.

ఉదయ్ తన సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలను వెల్లడించారు. బాధితురాలిగా పేర్కొంటున్న తోటి మహిళా ఐపీఎస్ బ్యాచ్‌మేట్‌తో తనకు ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం ఉందని ఆయన దాంట్లో పేర్కొన్నారు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా తమ మధ్య ఉన్న సంబంధం కొనసాగిందని లేఖలో స్పష్టం చేశారు.సదరు మహిళా అధికారిణి తనంతట తానే తన గదికి వచ్చి తలుపు తీయమని కోరిందని ఉదయ్ లేఖలో వివరించారు. దీనికి సంబంధించిన దృశ్య శ్రవణ (వీడియో) ఆధారాలు తన వద్ద భద్రంగా ఉన్నాయని, ఈ విషయాలన్నింటినీ ఆమె భర్తకు కూడా ఇప్పటికే వివరించానని తెలిపారు. సదరు డిజిటల్ ఆధారాలన్నీ తన మొబైల్ ఫోన్‌లో ఉన్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.

Also Read : పార్టీ మార్పు విషయంలో బిగ్‌ ట్విస్ట్‌…BRSలోనే కొనసాగుతానన్న మల్లారెడ్డి

మరోవైపు, బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రహస్యంగా తన ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, ఇటీవల తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగికంగా వేధించాడని, మెడపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరిస్తూ నిర్బంధించాడని ఆమె ఆరోపించారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2) సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని 66E, 67A సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

ఈ ఘటనకు సంబంధించి అకాడమీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళా ఐపీఎస్ చేసిన ఆరోపణలలో నిజముందని ప్రివిలేజ్ కమిటీ నిర్ధారించింది. కమిటీ సిఫార్సుల మేరకు పోలీస్ అకాడమీ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది.ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. లేఖలో పేర్కొన్న ఫోన్ ఆధారాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఆయన ఆరోపించిన నలుగురు వ్యక్తుల పాత్రపై కూడా లోతైన విచారణ జరుపుతున్నారు.

కాగా, ఉదయ్ కృష్ణారెడ్డి జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా సాగింది. పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వీధుల్లో కూరగాయలు విక్రయిస్తూ నానమ్మకు ఆసరాగా ఉండేవాడు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకుని, సొంత కష్టంతో తొలుత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక సీఐ నుంచి ఎదురైన అవమానాన్ని సవాలుగా తీసుకుని, తన ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించాలనే పట్టుదలతో శ్రమించారు. అనుకున్నట్లే యూపీఎస్సీ (UPSC) పరీక్షల్లో విజయం సాధించి ఐపీఎస్ స్థాయికి ఎదిగారు. ఎంతో శ్రమించి సాధించుకున్న ఐపీఎస్ హోదాలో ట్రైనీగా ఉన్న సమయంలోనే ఇలాంటి కేసులో ఇరుక్కుని ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లడం ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read : జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలతో జలమయమైన జిల్లాలూ.. నలుగురు మృతి

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.