Trainee IPS Harassment
Trainee IPS Harassment

హైదరాబాద్‌‌ రాజేంద్రనగర్ పరిధిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ట్రైనింగ్‌ తీసుకుంటున్న ఓ IPS అధికారి దారుణానికి ఒడిగట్టాడు. తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడీ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వేధింపులపై బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సివిల్స్ సాధించిన ఐపీఎస్ అధికారులకు రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తుంటారు. అయితే ఈ బ్యాచ్‌లోనే ఏపీకి చెందిన మాలగాని ఉదయ్ కృష్ణారెడ్డి కూడా IPS ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అదే అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిణిని అతడు కొంత కాలంగా తీవ్ర మానసిక, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు తేలింది. బాధిత మహిళా ఐపీఎస్ అధికారిణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు తెలిపింది.

ఉదయ్ కృష్ణారెడ్డి తనను ఒక రోజు బలవంతంగా గదిలోకి లాక్కెల్లాడని.. అక్కడ తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. అంతేకాకుండా తనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను తనకు తెలియకుండా సీక్రెట్‌గా మొబైల్‌లో రికార్డు చేసి తరచూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపింది. అతడికి లొంగకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి తన కెరీర్, జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించినట్లు వెల్లడించింది.

అయితే అక్కడితో ఆగకుండా నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి మరింత బరితెగిస్తూ.. సీక్రెట్‌గా తీసిన ప్రైవేట్ వీడియోలను బాధిత మహిళా ఐపీఎస్ అధికారిణి భర్తకు వాట్సాప్‌లో పంపించినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి, అవమానానికి గురైన ఆమె.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిలింగ్, అసభ్యకర మెసేజ్‌లు పంపించడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

కానిస్టేబుల్ To ఐపీఎస్

గతంలో ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఉదయ్ కృష్ణారెడ్డి.. అక్కడ ఒక ఉన్నతాధికారి చేతిలో అవమానానికి గురై తట్టుకోలేక రాజీనామా చేశాడు. అనంతరం ఆ కసి, పట్టుదలతో చదివి.. సివిల్స్ సాధించి IPS అయ్యాడు. ఆ సమయంలో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది. ఒక కానిస్టేబుల్ స్థాయి నుండి ఐపీఎస్ స్థాయికి ఎదిగిన అతని కథ ఎంతో మందికి ఇన్స్సిరేషన్ అయ్యింది. కానీ ఇప్పుడు అదే వ్యక్తి.. తోటి మహిళా అధికారిణి పట్ల నీచంగా ప్రవర్తించడంతో విమర్శలకు గురవుతున్నాడు. మరోవైపు ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.