Ayodhya Ram Temple :  అయోధ్యలోని రామమందిర నిర్వహణ, పరిపాలన బాధ్యతలను పర్యవేక్షించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది.

ఈ పదవికి దరఖాస్తు చేసే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పరిపాలన లేదా ఆర్థిక విభాగాల్లో కనీసం 20 ఏళ్ల పని అనుభవం ఉండాలనేది ప్రధాన నిబంధన. అభ్యర్థులు కచ్చితంగా ఆచారబద్ధమైన హిందువులై ఉండాలని, వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే రామ భక్తులైతే బాగుంటుందని ట్రస్ట్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. వృత్తిపరమైన అర్హతలతో పాటు, అభ్యర్థికి నిజాయితీ, నాయకత్వ లక్షణాలు, అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం ఉండాలని స్పష్టం చేసింది.

Also Read : కోర్టులో క్షుద్రపూజలు.. జడ్జి కుర్చీపై మంత్రాలు : మహిళ అరెస్ట్ !

ఎంపికైన అభ్యర్థికి మొదట మూడు సంవత్సరాల పాటు పదవీ కాలం ఉంటుంది. ఈ బాధ్యతలు చేపట్టిన వారు కచ్చితంగా అయోధ్యలోనే ఉండాలి. మందిర రోజువారీ పనులు, ట్రస్ట్ నిర్ణయాల అమలు, సిబ్బంది పర్యవేక్షణ, మతపరమైన కార్యక్రమాల మధ్య సమన్వయం చేయడం వంటివన్నీ CEO బాధ్యతలే. దరఖాస్తులను పరిశీలించడానికి ట్రస్ట్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దరఖాస్తులు సమర్పించడానికి జూలై 18 చివరి తేదీ. ఆ తర్వాత నెల రోజుల్లోపు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది.

మందిరానికి వచ్చే విరాళాల్లో చోటుచేసుకున్న దొంగతనం ఘటనల తర్వాత CEO నియామకంపై అందరి దృష్టి పడింది. మరోవైపు, ఈ నియామకం విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని, ట్రస్ట్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడుతోంది. ఈ పదవికి కేవలం రిటైర్డ్ అధికారులు మాత్రమే ఉండాలనే నిబంధన ఏమీ లేదని, అభ్యర్థుల అర్హతలను నిర్ణయించే పూర్తి అధికారం ట్రస్ట్‌కే ఉంటుందని వీహెచ్‌పీ స్పష్టం చేసింది.

Also Read : లార్డ్స్‌లో భారత మహిళల చారిత్రాత్మక విజయం: ఇంగ్లాండ్‌పై 270 పరుగుల తేడాతో భారీ విజయం

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.