Bangkok Pub Fire :  బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 27 మంది మరణించగా, మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. బ్యాంకాక్‌లోని చటుచాక్ జిల్లాలో ఉన్న రోంగ్ బీర్ నా లాట్ ఫ్రా పబ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే దట్టమైన పొగ కమ్మేసింది.

పీఎం అనుతిన్ చార్న్‌విరాకుల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పబ్‌లో మంటలు వ్యాపించగానే ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది వెనుక వైపు ఉన్న మరుగుదొడ్ల వైపు పరుగులు తీశారని, కానీ అక్కడ బయటకు వెళ్లేందుకు సరైన ఎగ్జిట్ మార్గాలు లేకపోవడంతోనే మరణాలు ఎక్కువగా సంభవించాయని ఆయన తెలిపారు. మొత్తం 27 మృతదేహాలను వెలికితీశామని, పబ్‌లో చిక్కుకున్న మరికొందరిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించామని వెల్లడించారు.

Also Read : ట్రంప్ సన్నిహితుడి డెత్ మిస్టరీ: లిండ్సే గ్రాహం మరణం వెనుక అసలు కుట్ర ఏంటి?

బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అడ్మినిస్ట్రేషన్ విపత్తు నివారణా విభాగం డైరెక్టర్ సురియాచాయ్ రవివాన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 63 మంది గాయపడ్డారని, వారిలో 22 మంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని బ్యాంకాక్ గవర్నర్ చడ్‌చార్ట్ సిట్టిపుంట్ పేర్కొన్నారు. మంటలు పబ్ ముందు ఉన్న స్టేజ్ వద్ద మొదలై వేగంగా వ్యాపించాయని, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే పరిస్థితి చేయి దాటిపోయిందని రవివాన్ చెప్పారు.

అగ్నిమాపక సిబ్బంది చక్రిత్ ఖోంగ్‌కోమ్ మాట్లాడుతూ, తాము చేరుకునే సరికి పబ్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందని, చాలామంది శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెప్పారు. పబ్ లోపల ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. పబ్‌కు సరైన పర్మిట్లు ఉన్నాయని, ఫైర్ ఎగ్జిట్లు కూడా ఉన్నాయని గవర్నర్ పేర్కొన్నప్పటికీ, అగ్నిప్రమాదం వేగంగా వ్యాపించడం, పొగతో కళ్లు కనిపించకపోవడం వల్ల వినియోగదారులు బయటకు రాలేకపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో పబ్‌లో ఉన్న ఒక బ్యాండ్ సభ్యుడు మాట్లాడుతూ, లైట్లు ఆరిపోయిన వెంటనే దట్టమైన పొగ అలుముకుందని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయని చెప్పారు. చీకటిలో ఏం జరుగుతుందో అర్థం కాక, ఆక్సిజన్ అందక చాలామంది నేలమీద పడిపోయి సహాయం కోసం అరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నాయి. ఈ సంఘటన బ్యాంకాక్‌లో ఇటీవల జరిగిన అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది.

Also Read : ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాలు షాక్.. ఖతార్, ఒమన్‌లను టార్గెట్ చేయడం వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.