
EHS Health Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఊరటనిచ్చింది. ఎన్నో ఏళ్లుగా వారు ఆశగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) హెల్త్ కార్డులను ఈనెల 15 (జులై 15, 2026) నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నూతన విధానంలో ఉద్యోగుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతను జోడించారు. క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత నూతన హెల్త్ కార్డులను ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ల ద్వారానే నేరుగా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఉద్యోగులు, ఆసుపత్రుల వివరాలు, చికిత్సల సమాచారంతో కూడిన పూర్తి స్థాయి ‘ఈహెచ్‌సీటీ’ (EHCT App) మొబైల్ అప్లికేషన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ కార్డుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో పూర్తిగా నగదు రహిత (Cashless) నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి.
ఈ చారిత్రాత్మక ఈహెచ్‌ఎస్ హెల్త్ కార్డులను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా, లాంఛనంగా పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన తేదీని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. పథకం అమలును మరింత సులభతరం చేసేందుకు, రాబోయే నాలుగు రోజుల్లో నూతన ఈహెచ్‌ఎస్ మార్గదర్శకాలకు (EHS Guidelines) సంబంధించిన అధికారిక జీవోను (ఉత్తర్వులను) విడుదల చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు.
ఈ నూతన హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవల పరిధిని ప్రభుత్వం భారీగా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 943 కార్పొరేట్,ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ కార్డులపై నగదు రహిత చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా దాదాపు 2,594 రకాల వైద్య విధానాలు (Procedures/Treatments) కవర్ కానున్నాయి. అలాగే ఈ చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (CGHS) రేట్లను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక ఆరోగ్య అవసరాలు, ఉచిత మందుల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ సొంత ఖర్చుతో అత్యాధునిక వెల్‌నెస్ సెంటర్లను (Wellness Centers) ఏర్పాటు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. కాగా, ఈ నూతన మార్గదర్శకాల అమలుపై మరింత విస్తృతంగా చర్చించేందుకు ఈనెల 13వ తేదీన ఈహెచ్‌ఎస్ సీఈఓతో మరో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రధాన సమస్యను పరిష్కరిస్తూ హెల్త్ కార్డుల అమలు తేదీని ఖరారు చేయడంపై ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఎండీ. ఎక్కా, ముఖ్యకార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, డీజీ షికా గోయల్‌లతో పాటు టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్వర్, టీజీవో ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు , వివిధ ఉపాధ్యాయ, క్లాస్-4, పెన్షనర్ల సంఘాల ముఖ్య నేతలు పాల్గొన్నారు.









