donald Trump

అమెరికా, ఇరాన్ మధ్య వార్ మళ్లీ ముదురుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన హిట్ కిల్ లిస్ట్‌లో తానే మొదటి స్థానంలో ఉన్నానని అన్నారు. టర్కీలో జరిగిన ప్రతిష్టాత్మక నాటో సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన ఓ ప్రత్యేక మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. టర్కీలో నాటో సదస్సు ముగించుకుని తిరిగి అమెరికా వెళ్లే క్రమంలో ట్రంప్ తన ప్రయాణ ప్రణాళికలను ఆకస్మికంగా మార్చుకున్నారు.

Also Read : ఒక్క సెకనులో సినిమా డౌన్‌లోడ్.. త్వరలో దేశంలోకి 6జీ.. ఎప్పటి నుంచంటే?

నిజానికి ఖతార్ దేశం తనకు అధికారికంగా బహుమతిగా ఇచ్చిన, సర్వసౌకర్యాలు కలిగిన సరికొత్త అత్యాధునిక విమానంలో ఆయన ప్రయాణించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దానికి బదులుగా గతంలో ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించిన పాత మోడల్ అత్యంత పటిష్టమైన మిలిటరీ భద్రతా విమానాన్ని ఎంచుకుని అమెరికాకు వెళ్లారు. అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఇరాన్ నుంచి పొంచి ఉన్న క్షిపణి లేదా వైమానిక ముప్పు ఏమైనా కారణమా అని రిపోర్టర్ ప్రశ్నించారు.

అప్పుడు ట్రంప్ స్పందిస్తూ.. అవును, మీరు విన్నది నిజమే. నేను ఇరాన్ కిల్‌ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నానని అన్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాను ఏ మాత్రం భయపడే ప్రసక్తే లేదన్నారు. నేను ఇరాన్ హిట్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నప్పటికీ దాని గురించి నేను పెద్దగా ఆందోళన పడను.. పట్టించుకోను కూడా అని అన్నారు. ఎందుకంటే నేను నా దేశ రక్షణ కోసం, నా ప్రజల కోసం నా పనిని నిర్భయంగా చేసుకుంటూ వెళ్తాను. అమెరికా చరిత్రలో గతంలో ఏ ప్రెసిడెంట్ చేయనంత అత్యుత్తమంగా నేను నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. అందుకే శత్రుదేశాలు నన్ను టార్గెట్ చేస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read : అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్‌ రద్దు: ఆర్టికల్-5 చుట్టూ ముదురుతున్న ఉద్రిక్తతలు

ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వృత్తి అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వరుస దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఇరాన్‌తో గతంలో ఉన్న కాల్పుల విరమణ చాప్టర్ పూర్తిగా ముగిసిపోయిందని అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఆ దేశంతో ఎలాంటి శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని, వారితో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నట్లు ట్రంప్ తేల్చి చెప్పారు.