
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గగన్‌యాన్. అంతరిక్షంలోకి స్వదేశీ సాంకేతికతతో మనుషులను పంపడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సొంతంగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేపట్టాయి. ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు కనుక విజయవంతమైతే అంతరిక్షంలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా భారత్ ప్రపంచ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.
గగన్‌యాన్ మిషన్ ప్రధాన లక్ష్యం ముగ్గురు భారతీయ వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి సురక్షితంగా పంపడం. వ్యోమగాములు అంతరిక్షంలో మూడు రోజుల పాటు ఉండి.. అక్కడ మైక్రోగ్రావిటీ వాతావరణంలో వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ప్రయోగం పూర్తి అయిన తర్వాత వారు ప్రయాణించే క్యాప్సూల్‌ను తిరిగి భూ వాతావరణంలోకి సురక్షితంగా రప్పిస్తారు. అయితే వీరిని బంగాళాఖాతంలో ల్యాండ్ చేయించడం ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనది.
Also Read : అమెరికా-ఇరాన్ సీజ్ఫైర్ రద్దు: ఆర్టికల్-5 చుట్టూ ముదురుతున్న ఉద్రిక్తతలు
ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం కోసం ఇస్రో తన రికార్డుల రాకెట్ అయిన LVM3ను ఉపయోగిస్తోంది. మనుషులను మోసుకెళ్లడానికి వీలుగా ఈ రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను మరింత సురక్షితంగా.. అంటే ‘హ్యూమన్ రేటెడ్’ రాకెట్‌గా ఇస్రో రీ-డిజైన్ చేసింది. వ్యోమగాములు ప్రయాణించే భాగాన్ని ‘ఆర్బిటల్ మాడ్యూల్’ అంటారు. ఇందులో వ్యోమగాములు కూర్చోవడానికి వారు శ్వాస పీల్చుకోవడానికి భూమి లాంటి వాతావరణాన్ని ‘క్రూ మాడ్యూల్’ కల్పిస్తుంది. అలాగే రాకెట్‌కు అవసరమైన ఇంధనం, విద్యుత్ అందించే ‘సర్వీస్ మాడ్యూల్’ అనే రెండు భాగాలు ఉంటాయి. ప్రమాద సమయాల్లో వ్యోమగాములను రక్షించే ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ కూడా ఇందులో ఉంది.
గగన్‌యాన్ మిషన్ కోసం భారత వాయుసేనకు చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను ఇస్రో ఎంపిక చేసింది. ఈ బృందంలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు. వీరికి రష్యాలోని గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో స్పేస్‌సూట్ దరించడం, శూన్య ప్రదేశంలో జీవించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం వంటి అంశాలపై సుదీర్ఘ కాలం పాటు కఠినమైన అడ్వాన్స్డ్ శిక్షణ ఇచ్చారు. వీరిలో ముగ్గురు తుది ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
మనుషులను నేరుగా పంపడానికి ముందే అన్ని రకాల సాంకేతిక వ్యవస్థల భద్రతను పరీక్షించడానికి ఇస్రో కొన్ని ప్రయోగాత్మక అన్మ్యాన్డ్ మిషన్లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘వ్యోమమిత్ర’ అనే హాఫ్-హ్యూమనాయిడ్ మహిళా రోబోను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రోబో అంతరిక్ష నౌకలోని పారామితులను పర్యవేక్షించడం, కంట్రోల్ ప్యానెల్స్ ఆపరేట్ చేయడం, భూమిపై ఉన్న కంట్రోల్ రూమ్‌కు సిగ్నల్స్ పంపడం వంటి పనులు చేస్తుంది. వ్యోమగాములు అంతరిక్షంలో ఎదుర్కొనే శారీరక మార్పులు, ఒత్తిడిని ఈ రోబో ద్వారా ముందే అధ్యయనం చేసి, మానవ సహిత ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేస్తుంది.
భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సుమారు రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అమెరికా, చైనా వంటి దేశాలు ఇలాంటి ప్రయోగాల కోసం ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గగన్‌యాన్ ప్రాజెక్టు కేవలం ఒక అంతరిక్ష ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో భారతదేశం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇది పునాది అని చెప్పవచ్చు.
Also Read : ఆ ఒక్క సంతకంతో చైనా కథ క్లోజ్.. మోదీ మాస్టర్ ప్లాన్‌తో బీజింగ్‌కు మైండ్ బ్లాక్!









