ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనలో ఉన్నారు. చైనాను కంచెకు పంపించేందుకు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత పట్టును పెంచుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. పర్యటనలో భాగంగా మొదట ఇండోనేషియాతో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం కుదుర్చుకుని చైనాకు భారత్ భారీ షాకిచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో కలిసి చైనా గుత్తాధిపత్యం ఉన్న మరో కీలక రంగాన్ని దెబ్బతీసేందుకు సిద్ధమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మెల్‌బోర్న్‌లో గురువారం ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక భేటీలో రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యంతో పాటు అత్యంత కీలకమైన రేర్ ఎర్త్, యురేనియం సరఫరా ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్లు, సెమీకండక్టర్లు, రక్షణ రంగ పరికరాల తయారీకి ఈ అరుదైన ఖనిజాలు ఎంతో అవసరం. వీటి సరఫరాపై ప్రస్తుతం చైనాకు పూర్తి ఏకస్వామ్యం ఉంది. ఇటీవలి కాలంలో చైనా వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో భారత్ సహా పలు దేశాలు ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాతో భారత్ కుదుర్చుకోబోయే ఒప్పందం చైనా ఇంధన సామ్రాజ్యానికి గట్టి దెబ్బ కానుంది.

Also Read : అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్‌ రద్దు: ఆర్టికల్-5 చుట్టూ ముదురుతున్న ఉద్రిక్తతలు

దీనితో పాటు ఇరు దేశాల మధ్య యురేనియం ఎగుమతి ఒప్పందం కూడా ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా ఉంది. 2014లోనే భారత్-ఆస్ట్రేలియా మధ్య అణు సహకార ఒప్పందం కుదిరినప్పటికీ.. కేవలం శాంతియుత అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి కోసమే అణు ఇంధనాన్ని వాడాలనే నిబంధనల వల్ల ఇప్పటివరకు యురేనియం రవాణా పరిమితంగానే సాగింది. తాజా భేటీలో ఈ సరఫరాను మరింత పెంచేలా కీలక ప్రకటనలు రానున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాకు భారత్ 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండటం, అక్కడ దాదాపు పది లక్షల మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు.

ఈ పర్యటనకు ముందే ఇండోనేషియాలో భారత్ సాధించిన విజయం చైనాకు నిద్ర లేకుండా చేస్తోంది. జకార్తాలో ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోల మధ్య జరిగిన చర్చల్లో.. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ‘ఆస్ట్రా’ క్షిపణి విక్రయంతో పాటు ‘బ్రహ్మోస్’ క్రూయిజ్ క్షిపణి సరఫరా కోసం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో భారత్ కుదుర్చుకున్న మూడవ క్షిపణి ఎగుమతి ఒప్పందం ఇది. ప్రపంచ సముద్ర వాణిజ్యానికి కేంద్రాలైన మలక్కా, లోంబోక్, సుండా, ఒంబై-వెటార్ జలసంధులపై ఇండోనేషియాకు పట్టు ఉంది.

అమెరికా తన ‘ఇండో-పసిఫిక్’ వ్యూహం నుండి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్న సమయంలో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి పసిఫిక్ ప్రాంత దేశాలతో బంధాన్ని బలోపేతం చేయడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండోనేషియాలో బ్రహ్మోస్ గర్జన, ఆస్ట్రేలియాతో అరుదైన ఖనిజాలు, యురేనియం ఒప్పందాలు పూర్తి చేసుకుని.. శుక్రవారం ప్రధాని మోదీ 40 ఏళ్ల తర్వాత భారత ప్రధానిగా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టనున్నారు.

Also Read : గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. భారీగా పెరగనున్న ధరలు?