భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయి. అయితే రెండు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక స్నేహ బంధాన్ని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ అందించిన సహకారానికి ఇండోనేషియా ప్రభుత్వం ఆయనకు అత్యంత అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఇండోనేషియా దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘బింతాంగ్ ఆదిపూర్ణ’ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రధాని మోదీకి స్వయంగా బహూకరించారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఇస్తానా మెర్డెకా ప్యాలెస్‌లో ఘనంగా సైనిక వందనంతో కూడిన అధికారిక స్వాగతం లభించింది. రెండు దేశాల జాతీయ జెండాలను చేతపట్టుకుని ఇండోనేషియా చిన్నారులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోల నేతృత్వంలో ఇరు దేశాల ఉన్నతాధికారుల ప్రతినిధి బృందాల మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని గరిష్ట స్థాయికి విస్తరించుకోవడంపై ఇరు నేతలు చర్చించారు.

Also Read : ఇరాన్‌కు బిగ్ షాకిచ్చిన అమెరికా.. భారీగా పెరగనున్న క్రూడ్ ఆయిల్ ధరలు

జకార్తాలో ఐఐఎం బెంగళూరు అంతర్జాతీయ క్యాంపస్

విద్యా రంగంలో ఇరు దేశాల మధ్య చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి చెందిన ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరు తన మొట్టమొదటి అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఇండోనేషియా, ఆసియా విద్యార్థులకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన మేనేజ్‌మెంట్ విద్య స్థానికంగానే అందుబాటులోకి రానుంది.

రక్షణ, సముద్ర భద్రత

భారత్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను పటిష్టం చేయడం కోసం ఇండోనేషియాతో చేతులు కలిపాయి. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, ఉమ్మడి రక్షణ ఉత్పత్తి, సముద్ర మార్గాల్లో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం, ఉమ్మడి నావికాదళ, సైనిక విన్యాసాలను పెంపొందించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

క్రిటికల్ మినరల్స్

ఆధునిక గ్లోబల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీల తయారీకి అత్యంత అవసరమయ్యే లిథియం, కోబాల్ట్ వంటి కీలకమైన ఖనిజాల సరఫరా గొలుసును పటిష్టం చేసుకోవడం, వీటి అన్వేషణ, మైనింగ్ ప్రక్రియల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

వ్యవసాయం, ఆహార భద్రత

గ్లోబల్ సప్లై చైన్ ఇబ్బందుల నేపథ్యంలో ఆహార భద్రతను కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, ఉమ్మడి వ్యవసాయ పరిశోధనలు చేయడం, పంటల ఉత్పాదకతను పెంచడం, విపత్తు సమయాల్లో ఆహార ధాన్యాల పరస్పర సరఫరాను సులభతరం చేయడంపై ఒప్పందం జరిగింది.

ఉక్కు రంగం

ఇరు దేశాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చేలా ఉక్కు పరిశ్రమల మధ్య ఉమ్మడి భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు, పారిశ్రామిక నైపుణ్యాల మార్పిడి ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మరింత వేగంగా విస్తరించాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.

Also Read : ప్రపంచ బ్యాంక్ తాజా ఆదాయ వర్గీకరణ …భారత్ కంటే శ్రీలంక గ్రేట్‌..మెరుగ్గా వియత్నం, ఫిలిప్పీన్స్..

ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ సహకారం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సరికొత్త సాంకేతిక రంగాలతో పాటు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉమ్మడిగా పనిచేయడానికి ఇరు దేశాల నేతలు అంగీకారం తెలిపారు. భారతదేశపు డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని ఇండోనేషియాలో కూడా మరింత విస్తరించడానికి ఇది దోహదపడనుంది.