పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పేందుకు జరిగిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిలో మూడు ముడి చమురు ట్యాంకర్లపై గుర్తుతెలియని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో ఇరాన్‌కు ఇచ్చిన చమురు విక్రయాల ప్రత్యేక మినహాయింపును అమెరికా తక్షణమే రద్దు చేసింది.

వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య గత నెలలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. ఇరాన్ తన ముడి చమురు మరియు దానికి సంబంధించిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి, విక్రయించడానికి ఆగస్టు 21 వరకు అమెరికా మొదట అనుమతి ఇచ్చింది. అయితే తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ చర్యలు చాలా ఆమోదయోగ్యం కానివి అని మండిపడ్డ ఒక అమెరికా ఉన్నతాధికారి ఈ మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ఇరాన్ తగిన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య కుదిరిన సున్నితమైన ఒప్పందం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అయితే ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ ఇరాన్‌తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని అమెరికా పేర్కొంది.

Also Read : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థిని దుర్మరణం!

హర్మూజ్ జలసంధి పరిసరాల్లో రాత్రి వేళ ఒక భారీ ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరగడంతో అందులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ వరుస దాడులకు గురైన నౌకల్లో ఖతార్ దేశానికి చెందిన ‘అల్-రెకాయత్’ అనే ఎల్‌ఎన్‌జీ (LNG) ట్యాంకర్ కూడా ఉంది. ఈ ఘటనను ఖతార్ తీవ్రంగా ఖండించింది. తమ నిరసనను తెలియజేయడానికి ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌కు దోహా సమన్లు ​​జారీ చేసింది. అంతర్జాతీయ సముద్ర భద్రతపై జరిగిన ఈ దాడికి, నష్టానికి ఇరానే పూర్తి బాధ్యత వహించాలని ఖతార్ డిమాండ్ చేసింది.

ఈ దాడులన్నీ ఒమన్ దేశానికి సమీపంలోనే జరిగాయి. నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఒమన్ తన తీరప్రాంతాన్ని ఆనుకుని ఒక తాత్కాలిక రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే ఇరాన్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఆ ఇరుకైన జలమార్గాన్ని ఉపయోగించే అంతర్జాతీయ నౌకల నుండి భారీగా రుసుము వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. వారం రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న గల్ఫ్ రీజియన్ ఈ దాడులతో మళ్లీ వేడెక్కింది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : మోదీ పథకాలను నేను కాపీ కొట్టా.. ఇండోనేషియా ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్!