
Indonesia : భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం జకార్తాలో ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ పక్కనే కూర్చుని ఉండగా, సుబియాంతో మాట్లాడుతూ.. తాము భారత్ లో చాలా విజయవంతమైన పలు మోదీ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి తమ దేశంలో అమలు చేస్తున్నామని బహిరంగంగానే ఒప్పుకున్నారు. భారత్‌లో అమలవుతున్న ఈ పథకాలకు ఎలాంటి కాపీరైట్ హక్కులు లేకపోవడం తన అదృష్టమంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని మోదీతో పాటు విందులో పాల్గొన్నవారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు.
తాను ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానాన్ని చాలా కాలంగా గమనిస్తున్నానని, ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలను తాము ఇండోనేషియాలో అనుకరిస్తున్నామని సుబియాంతో చెప్పారు. ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే భారతదేశం, ఇండోనేషియాలు ఒకే రకమైన ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని.. అక్కడ వందల కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చిన పథకాలు తమ దేశ ప్రజలకు కూడా కచ్చితంగా మేలు చేస్తాయని ఆయన వివరించారు. ఈ ప్రయోగాలు తమ దేశంలో కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయని, ఇందుకు గానూ ప్రధాని మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఇండోనేషియా చేరుకోగా, ఇరు దేశాల మధ్య దాదాపు డజనుకు పైగా కీలక ఒప్పందాలు జరిగాయి. ఇందులో అత్యంత ప్రధానమైనది.. భారతదేశపు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐఎం బెంగళూరు తన సరికొత్త అంతర్జాతీయ క్యాంపస్‌ను ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రాంతంలో ఉన్న సింఘసరి ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏర్పాటు చేయబోతోంది. గతంలో ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్‌లో తన క్యాంపస్‌ను ప్రారంభించగా, విదేశాల్లో ఏర్పాటు కాబోతున్న రెండో ప్రీమియర్ ఇండియన్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ ఇదే కావడం విశేషం. విద్యా రంగంతో పాటు రక్షణ, మౌలిక వనరులు, సముద్ర భద్రత వంటి రంగాల్లో కూడా ఇరు దేశాలు చేతులు కలిపాయి.
ఆరోగ్య రంగంలో కూడా భారత్-ఇండోనేషియాల మధ్య ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం కుదిరింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ, ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఏజెన్సీ ఆఫ్ డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ కలిసి వైద్య ఉత్పత్తుల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల మార్పిడిపై సంతకాలు చేశాయి. దీనివల్ల భారతీయ వైద్య ఉత్పత్తులకు ఇండోనేషియా మార్కెట్లో మరింత సులభంగా గుర్తింపు లభిస్తుంది. జకార్తాలో ఈ ద్వైపాక్షిక చర్చలను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ, తన తదుపరి పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు బయలుదేరనున్నారు.









