
Strait of Hormuz : ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన, వ్యూహాత్మక సముద్ర మార్గం ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) పై ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై కొత్తగా ‘సర్వీస్ ఫీజు’ (సేవా రుసుము) విధించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రపంచ వాణిజ్య వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలవగా, భారతీయ నౌకలు కూడా ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తింది. అయితే, ఈ విషయంలో ఇరాన్ భారత్‌కు పెద్ద ఉపశమనం కలిగిస్తూ అధికారికంగా ఒక స్పష్టమైన భరోసా ఇచ్చింది.
బీజింగ్‌లో జరిగిన ‘వరల్డ్ పీస్ ఫోరమ్’ సమావేశంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దోల్రేజా రహ్మానీ ఫాజ్లీ ఈ అంశంపై మాట్లాడారు. హోర్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ ప్రాంతీయ జలాల పరిధిలోకి వస్తుందని, కాబట్టి అక్కడి నుండి వెళ్లే నౌకల నుండి సేవా రుసుము వసూలు చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. అయితే దీనిని ‘టోల్ ట్యాక్స్’ అని పిలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత్‌కు ఉన్న ఆందోళనలను దూరం చేస్తూ.. “కష్టకాలంలో ఇరాన్‌కు అండగా నిలిచి, నిజమైన స్నేహాన్ని నిరూపించుకున్న దేశాలకు ఈ రుసుము విధింపులో ఖచ్చితంగా ‘ప్రత్యేక రాయితీలు’ (Special Treatment) ఉంటాయి” అని ఆయన ప్రకటించారు.
భారత్‌కు దక్కిన సురక్షిత ప్రయాణ గ్యారంటీ:
ఇరాన్ ఇంకా ఈ సేవా రుసుముకు సంబంధించిన పూర్తి విధివిధానాలను, ధరల పట్టికను అధికారికంగా విడుదల చేయలేదు. అయినప్పటికీ, భారత్-ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న బలమైన దౌత్య సంబంధాల దృష్ట్యా భారతీయ షిప్పింగ్ రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలుస్తోంది. గతంలో భారతదేశంలోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతహ్లీ కూడా న్యూఢిల్లీకి ఇదే విధమైన నమ్మకాన్ని ఇచ్చారు. ఇటీవల మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఏ ఒక్క భారతీయ ట్యాంకర్ నుండి తాము ఎలాంటి రుసుము వసూలు చేయలేదని ఆయన గుర్తుచేశారు.
భారత్-ఇరాన్ సంబంధాల లోతును వివరిస్తూ ఫతహ్లీ.. “ఇరాన్, భారతదేశ ప్రయోజనాలు , భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కష్టసమయాల్లో భారత్ అత్యంత నమ్మకమైన భాగస్వామిగా నిరూపించుకుంది. భవిష్యత్తులో కూడా హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే భారతీయ నౌకలన్నింటికీ పూర్తి రక్షణ, సురక్షితమైన మార్గం లభిస్తుంది” అని స్పష్టమైన వాగ్దానం చేశారు.
ప్రపంచ దేశాలకు హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం?
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర రవాణా మార్గాల్లో హోర్ముజ్ జలసంధి మొదటి వరుసలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే మొత్తం ముడి చమురు (Crude Oil) , ద్రవీకృత సహజ వాయువు (LNG) లలో దాదాపు ఐదో వంతు (20 శాతం) కేవలం ఈ సరుకు రవాణా మార్గం గుండానే వెళుతుంది. అందువల్ల, ఇరాన్ ఈ మార్గంలో ఎలాంటి కొత్త నియమాలను లేదా రుసుములను ప్రవేశపెట్టినా, దాని ప్రత్యక్ష ప్రభావం అంతర్జాతీయ చమురు ధరలపై , గ్లోబల్ ట్రేడ్‌పై పడటం ఖాయం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇరాన్ భారత్ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించడం భారత ఆర్థిక వ్యవస్థకు, దౌత్య నీతికి లభించిన ఒక పెద్ద విజయంగా నిపుణులు భావిస్తున్నారు.









